Saturday, February 6, 2016

అక్షర శోభ
================

అక్షరానికి
సుఖప్రసవమైందని
అందరూ అనుకుంటుంటే
చెప్పలేని ఆనందం
నన్ను చుట్టుముట్టి
ఉక్కిరిబిక్కిరిచేసి
ఉత్సాహం ఉరకలు
వేసేలా చేస్తున్నది.

ఇంతగా సంతసించడానికి
పూర్వ భాగంలో ఎంత శ్రమించానో
చుట్టూ పేరుకుపోతూ వున్న
ముళ్ళపొదలనడిగి తెలుసుకోవాలి!

అక్షరాన్ని ప్రేమించడమంటే
అమ్మను గట్టిగా కౌగలించుకుని
ఆత్మీయానురాగాల కలయికతో
చుబుకాన్ని చుంబించినట్లు.

మనసిచ్చిన ప్రేయసి కంట కన్నీటి
జాలులేర్పడకుండా కవ్వింతలతో
కులుకుల ముత్యాలను దండగా కూర్చి
సౌమనస్య భావనతో కంఠ సీమలో
ధరింపజేసినట్టు.


అల్లరిచేసి చెప్పిన పనిని చెయ్యను పొమ్మంటూ
మొరాయిస్తున్న చిరంజీవులను
గోడకుర్చీలు వేయించకుండా, సుతిమెత్తగా
వారిని ఆపనికుపక్రమించేలా
వొప్పించి సంసిద్ధం చేసినంత శ్రమ.

అక్షరాల అందమైన హొయలు
కనులారా వీక్షించినప్పుడల్లా
సురభిళ పరిమళమేదో శూన్యపరిధిలోంచి
వూడిపడి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి
నన్ను మరో సుందరమౌ స్వప్న సీమలో
విహరింపజేసేందుకు ఏర్పాట్లు చేసినంత ఆనందం!

అక్షరాలను కూర్చడమంటే ఆకాశ హర్మ్యాలకు
పునాది రాళ్ళు వేసినట్లేనని కొందరు జడుస్తూ వుంటారు.

ఎక్కడో విపినాటవిలో ఒంటరిగా వీరవిహారంచేసినట్లని
మరికొందరు మాయలోపడి మత్తిలి ప్రవర్తిస్తారు.
అక్షరమంటే మాటాడని మల్లెమొగ్గగా
మనసుతో మృదుమధురంగా సయ్యటలాడే
సంభాషణకు ముందుమాటలను కూర్చినట్లు.
అమృతకలశాన్ని అందిపుచ్చుకున్నట్లు.
అందుకే మనసుపొరల్లోంచి వెలువడిన
 ప్రతి అక్షరం ఒక్కొక్క సుమంలా గుబాళిస్తున్నట్లు.
ఆ తల్లికి పాదాభివందనంచేసి ఈ ఉపోద్ఘాతాన్ని
ఇంతటితో  ముగించి
 కావ్య కన్యకు కళ్యాణ శోభను సత్వరం తెప్పిద్దాం.
================================

No comments:

Post a Comment