Friday, February 5, 2016

కలనైనా, కలవరమoదైనా---
---------------------------------రావెల


కలలకూవాస్తవానికీ మధ్యన
అనాదిగాయేర్పడి ఘనీభవించిన
మంచు దిబ్బలను తొలగించి
వాటిని కలివిడిగా తిరిగేలా చేయాలని
కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాను.

చాలా సమయాల్లోనూ,సందర్భాలలోనూ
కలలూ వాస్తవాలూ సమాంతర రేఖల్లా
సాగిపోతూ వుండడం మనమెరుగని విషయమేమీ కాదు.

ఎన్నో సందర్భాలలో కలలకూ వాస్తవాలకూ మధ్యన
హస్తిమశకాంతరం వుండడం మనమెరుగని సత్యమేం కాదు.

అందినా అందకున్నా కొన్ని కలలు
మాధురీ ప్రధానమైన గీతాల్లా
చెవుల దగ్గర చాలాకాలంపాటు
 శ్రవణపేయంగా ప్రతిధ్వనిస్తూనేవుంటాయి.
కనుకొలకుల్లో అవి స్థిర నివాసమేర్పరచుకుని
వీలుదొరికినప్పుడల్లా విసిగించడమో
వేధించడమో విధ్యుక్త ధర్మంలా
తు.చ. తప్పకుండా నెరవేరుస్తూనే వుంటాయి.
మరికొన్ని కలలు చేదుగుళికల్లా మారిగొంతు దిగము పొమ్మంటూ
వేధించుకుతింటూ రాక్షసానందం పొందుతూ వుంటాయి.

కొన్ని కలలు జారుడుబండల్లా నిరంతరం
జారిపోవడానికే సాక్షాత్కరిస్తాయి.

ఉదయం తెలతెలవారుతుండగానే
నిశ్శాబ్దంగా చడీ చప్పుడూ చేయకుండా
నిష్క్రమిస్తూంటాయి.

మరికొన్నికలలు మనసులను ఆశల
శిఖరాగ్రాలకు చేర్చి ఊరింపజేస్తూ
ఉరకలు వేయిస్తూ తమలోతామే మురుసుకుంటాయి.

కొన్నికలలు చైతన్య స్రవంతులై మనకు
జ్ఞానోదయం కలిగించే దిశగా పయనిస్తూవుంటాయి.
మరికొన్నికలలు మన్నుదిన్న పాముల్లా మత్తుగా
జీవనమృతుల్లా మారి కలతపెడుతూ కన్నీటి
వరదలను సృష్టించి వెనుదిరిగి వెళుతుంటాయి.


కొన్ని కలలు కొన్ని వేళల్లో అక్షరాలను కౌగిలించుకుని
కవితలరూపంలో దర్శనమిచ్చి కాగితం మీద
ఆ భావాలను పెట్టేదాకా నిద్రపట్టనివ్వకుండా నీరస
పెట్టడంలో నిమగ్నమై మురిసి మెరిసిపోతూ వుంటాయి.

కొన్ని కలలు కధా సారాంశాలను వివరించి
అదృశ్యమై అనూయమైన ఆనందాన్ని
అమృతకలశంలో అందించి వెళుతుంటాయి.
ఏకలయినా అర్ధరాత్రో అపరాత్రో వచ్చి
కనుకొలకుల్లోకి దిగివచ్చి తమ దృశ్యాన్ని
ఆవిష్కరించి వచ్చినంత వేగంగా
అదృశ్యమై పోతూ  వుంటాయి.
ఏకలా మన మనోఫలకాలపై
చెరగనిముద్రవేయడానికి సాహసించవు.
తెలతెలవారుతుండగనే తెలిమంచులా కరగి
జ్ఞాపకాల వీధులకు వేళుతున్నామని చెప్పి
వడివడిగా నిష్క్రమించి వేదనకలిగిస్తూ వుంటాయి.
కలలన్నీ కల్లలుకాదని మనం తెలుసుకోగలగాలి.
పగటికలలుకంటున్నారని అపప్రధలు లోనుకాకుండా
తగు జాగ్రత్తలు తీసుకుంటూ మసలుకోవాలి.
అందుకోలేని శిఖరాలను
నమ్మ శక్యంగాని నిజాలను
కొన్నికలలు పనిగట్తుకుని కల్పితాలను సృష్టించి
కలతపెట్టడంలో ఆరితేరి వుంటాయి.

కరిగిన స్వప్నం తొణకిన స్వర్గం
రెండూ అనవరతం ఊహలకందని ఉయ్యాలలూగుతూ
ఊరేగుతూ ఊరిస్తూ ఉత్సాహపరుస్తూ వుంటాయి.
కొన్ని సార్లు కలలకూ వాస్తవానికి మధ్యన
కన్నీటిజలపాతాలుప్రవహిస్తూన్నంతకాలం
కలలు కలతల కార్ఖానాలలో కాగిపోతూ
వాస్తవ స్తవాలకు లొంగిపోయేది
లెమ్మని బెదిరిస్తూ సాగిపోతాయి .
కలలూ వాస్తవాలను కలపడంలో
మానవప్రయత్నాన్ని విరమిచకుండా
కొనసాగించాలని తెర్మానిస్తూ
సఫలీకృతం కాని మనోరధంతో
వెనుదిరగడమే మేలని నిర్ణయించుకున్నాను.
-----------------------------------





No comments:

Post a Comment