Saturday, March 19, 2016

గృహోన్ముఖంగా--
----------------------రావెల.

మా పల్లెకు నేనేప్పుడూ
వట్టిచేతులతో వెళ్ళిన గుర్తులేం లేవు..
ప్రతిసారీ ఓ పట్టాసంచీని భుజానికి
కొక్కెంలా తగిలించుకునే వెళుతుంటాను..

మొదటగా వూరిముందర చెరువు నీళ్ళులేని కళ్ళతో
ఆప్యాయంగా గుండెను తట్టి పలకరిపుల
 ప్రవాహంలో ముంచేస్తూ వుంటుంది..


ఊరిముందరతోపులో ఆంజనేయ స్వామి
పల్లె పురావైభవాన్ని కధలు కధలుగా
నాతో చెప్పుకుని సేదతీరాలని ఉరుకులుపెడుతూ ఆయాసపడుతుంటాడు--


చెరువుగట్టుమీద ఒకప్పుడు పండ్లూ ఫలాలతో విలసిల్లిన చెట్లన్నీ
కాపలా వేమయ్య కేకలకు భయపడి దాక్కున్న చాటు మాటు ప్రదేశాలను
దిసమొలలతో ఇప్పుడు దిష్టి బొమ్మాల్లా నిలబడుతూగూడా,
కనులారా మళ్ళీ ఆ చిలిపి చేష్టలను చూపాలని
 వగరుస్తునే వడివడిగా నావైపుకు వస్తూండడం గమనిస్తాను--



పీర్లసావిడిలో పీర్లన్నీ ఒకప్పుడు శమీ వృక్షం పైన
అర్జునుడు దాచిపెట్టిన అస్త్రసంపంపదకు ఆనవాలుగా వుండేవి

ఇప్పుడవన్నీ చిరుగులుపట్టిన చింకి పట్టుపీలికలతో  దీనమైన దృక్కులతో పలకరించడానికి పరుగెత్తుకుంటూ గసపెడుతూ రావడంబాధేసింది.
అప్పటి అబ్దుల్లా దీక్షగా వుపవాసాలుండి గుండాన్న్ని దాటినస్మృతులను
పూసగుచ్చినట్టు చెబుతున్నది


కరణంగారింటిముందుండవలసిన రచ్చబండ తరిగిన న్యాయానికి
దర్పణంలా సిమెంటు పెచ్చులను రాల్చుకుని దయనీయంగా కనపడుతున్నది.
 మూఢభక్తనుకున్నా సరే బొడ్రాయిమాత్రం పసుపూ కుంకుమలతో
ఇప్పటికీ కళకళలాడుతూవుండడం పెదవులపై చిట్టి చిరునవ్వును పూయించి
మురిసింది..

పోలేరమ్మ గుడిదాకా వెళ్ళి ఇదేమిటమ్మా నాపల్లెనిలా సుడిగాలులకొదిలేసి
తల్లడిల్లేలా చేసావని నిలదీయాలనుకున్నా గుండె చెరువైన
దు:ఖంతో ముందుకడుగులు వేయలేక బాధగా మళ్ళీ మరొకసారి
వస్తానని సెలవుతీసుకుని బరువైన గుండెలో
శిధిలమౌతున్న జ్ఞాపకాలను ఛిద్రంకాకుండా చూసుకుంటూ

ఖాళీగా వున్న సంచినేమో కన్నీళ్ళతో నింపుకుని
మళ్ళీ నగరానికి దిగుళ్ళ కావిళ్ళను మోసుకుంటూభారంగా తిరిగొచ్చాను..
=====================================================





No comments:

Post a Comment