Thursday, March 17, 2016

ఆమెను నేనెప్పుడూ
తాళపత్రాల తాకిడికి
ఒరిసిపోగూడదని భావిస్తుంటాను..
అందుకే అప్పుడే తయారయివచ్చిన
న్యూసు ప్రింట్ కాగితంలో చుట్టేసి
అక్షరాలపొత్తిళ్ళలోనే పొదివివుంచి
కనులకద్దుకోవాలని  చూస్తుంటాను..

నియమ నిబంధనలకు దూరంకాకుండా
హృద్యమైన పద్యాలకే పరిమితం చేయాలనుకుంటాను..

ఎప్పుడయినా వమన దోషం కలుగని
వచనకవితలో తనను వికసింపజేయాలనీ భావిస్తుంటాను..

లలిత గీతంలోనో శాస్త్రీయ సంగీతం కీర్తనలోనో
ఆమెను శ్రవణ పేయంగా తీర్చి దిద్దుకోవాలని భావిస్తాను..

భావ కవితోద్యమంలో ప్రభవించిన ఎంకిపాటలలో
ఉవ్వెత్తున ఎగసిపడే శృంగారభావనా విలసితయైన
సౌందర్యలలామనుగా రూపుదిద్దుకోవాలని ఊహించుకుంటాను.


ఏదయినా ఆమె నాకనునిత్యం ఓ కావ్యనాయికగానే
దర్శనమివ్వాలని శతధా,  అభిన్నంగా భావిస్తుంటాను--
=====================================

No comments:

Post a Comment