Wednesday, March 16, 2016

మగమృగయా వినోదమా !! ---అపజయోస్తు!
-------------------------రావెల.

దాన్ని   ఆటంటారో, మరి  వేటంటారో
తెలియదుగానీ,  అదే సమయంలో
నాకు గుర్తొచ్చేది మాత్రం
అరిటాకూ-ముల్లూ వున్న సామెత.
సరిగా ఆ క్రీడకే ఆసామెత
అన్వర్ధమై నిలుస్తుంది..

వసంతంలో చివురించిన
నునులేత సిగ్గులతో
కదలాడే ఆకులన్నీ
పరువాన్ని పోగేసుకున్న
అమ్మాయిల్లా ఆకృతిజెందుతాయి--

గ్రీష్మం గీపెడుతూనే వుంటుంది
స్వేదంవెలారుస్తూ బ్రదుకును
వెళ్ళదీస్తున్న తల్లిదండ్రులను
వెన్నంటి గుర్తుచేస్తూనే   ,
ఆ యోచన వారిని   కర్తవ్యతా
మూఢులుగాకుండా కాపుగాస్తుంది.

అకాల వసంతమో,  అస్సలేఎవరూ,
  ఆశించని అధిక వర్షపాతమో--
 చినుకంటూ రాలని వర్షాభావమో--
వొంటిపై నాలుగు  చినుకులు
పడగానే పులకించినట్లు
ప్రతి పొగడ్తకూ పొంగిపోవడం మొదలవుతుంది.

శరదృతువులో కాచే వెన్నెలంత మనోహరంగా
గుండే గొంతుకతో కొన్ని  కూనిరాగాలనాలపిస్తూ
ఏమాత్రం అలుపూ సొలుపూ తెలియకుండా
ఎక్కిళ్ళనూ ,  ఏకబిగిన పెడుతూ పోతుంది--

తననెవరో తలుచుకుంటూ తన్మయత్వం చెందుతున్నారని
ఇట్టే గుర్తు చేస్తూ నడినెత్తిన మెల్లగా రెండు దెబ్బలేసి
సంబాళించుకునేలా చేస్తుంది--
 కొనగోటివేళ్ళతో కనుకొలకుల్లోని
కన్నీటి బిందువులు సింధువులా మారకుండా
తుడుస్తూనే --సుతిమెత్తగా  హెచ్చరిస్తూ పోతుంది..

హేమంతపు శీతల స్పర్శ గజగజా వణికిస్తూ
అప్పుడప్పుడూ ఆలోచనలకూదూరంగా నెట్టేస్తూ,
ఘనీభవింపజేస్తూనే  భయకంపితను గావిస్తుంది..
ముగ్ధకూడా ---ముద్దలా పరిణమించడం అప్పుడే మొదలవుతుంది..

ఇక అక్కడితో ఆగనుపొమ్మంటూ పైరుపంటను పట్టిపీడించే
పేనుబంకలా అతుక్కుని వదలను పొమ్మంటూ శిశిరం వెంటబడుతుంది--
చెట్టును మోడుచేసితీరాలని భీష్మించుకు కూర్చుంటుంది--
అసలెందుకో జగతిలోని జాతులన్నీ ఆ చెట్టునే నిందించాలని
కృతనిశ్చయులై తప్పు లెంచే ప్రక్రియలో నిష్ణాతులవుతారు?-
అంత అందంగా అలంకరించుకుంటే ఎలా ?
అంటూ  చీత్కరిస్తూ వుంటారు--

ఆకులు రాలిపడే లోపే అందిపుచ్చుకుని
బాదం ఆకుల్తో కుట్టినవిస్తరిలాచేసుకునిమృష్టాన్న భోజనాన్ని
అనంగీకారంగానే కడుపారా తినేసి
ఎంగిలాకును విసిరినట్టు విసరాలని అదనుకోసం
మగ మృగం అనవరతం నిరీక్షణలో గడుపుతూ కాళసర్పంలా వేచి యుంటుంది--

ఇది అతివలపట్ల శాపమేనని అందరం తీర్మానించాలి--
నిర్భయ చట్టమన్నా,  భయంలేని మైనారిటీతీరని  యువతను
సంఘ బహిష్కరణతో శిక్షించండంటూ అందరినీ
 అనుక్షణం ప్రాధేయ పడుతూ పోవాలా?--

ఆరుగాలాలపాటు చెమటోడ్చి శ్రమజేసి పండించిన పంటను
ఎంతమాత్రం గి ట్టుబాటుకాని ధరలకు,  ఎగరేసుకునిపోవాలనుకునే  కాయతుదార్లను
కాళ్ళతో తొక్కించి వేయగల యంత్రాలను ఆడపిల్లల తల్లిదండ్రులకు
ఉచితంగా సరఫరాచేసి    ప్రజా సంక్షేమాన్నాశించే ప్రభుత్వాలు
తప్పనిసరిగా ఆదుకోవాలి------------------------------------------

No comments:

Post a Comment