Friday, April 29, 2016

తక్షణ కర్తవ్యం
---------------------రావెల
=================================

మళ్ళీ ఒక భగీరధుడి
కాళ్ళో గడ్డాలోపట్టుకు బ్రతిమాలాలి
చేసిన మహపరాధానికి గట్టిగా
చెంపలేసుకుని క్షమించమని అడగాలి
నరికి పడేసిన చెట్లన్నింటికీ
అపరాధ మహిమ్న స్తోత్రాలను పఠించి
మన్నించమని బ్రతిమాలాలి--
చేట్లు నాటడంతోనే పనయిందనే
భావనను పూర్తిగా విడనాడాలి..
వాటికి సరయిన వేళల్లో నీటిని పోసి
ఆదరణగా అదుకుంటూ చూసుకోవాలి..
రుతువులన్నింటినీ మన ప్రార్ధనలతో
ముంచెత్తి వాటిని మురిపించగలగాలి...
క్రమం తప్పకుండా అవి నేలకు దిగి రావాలని
కన్నీటి జలధారలకు కొంతకాలమయినా
విశ్రాంతిని చేకూర్చమని వినతి పత్రం సమర్పించాలి..


మనస్ఫూర్తిగా కోరుకుని జీవనం సాగించాలి...

హృదయం మనసూ మరోసారి కలుషితమైపోకుండా
కంటికి రెప్పలా ప్రకృతిని కాపాడుకోవాలని
ప్రగాఢంగా తీర్మానించుకోవాలి...28-4-16
==============================================



Thursday, April 28, 2016

నల్లటి దేవతావస్త్రాలలో నన్ను మాయచేద్దామని
మారు వేషంలో తయారయి వచ్చావా?
మృత్యువా నీ శీతల కౌగిలో నన్ను
దాచేయాలన్న ప్రయత్నమా ఇది!!

నీవంటే భయపడడం పూర్తిగా మానేసాను..
వేదాంతుల సుభాషితాలు విన్నాను
మహాత్ముల ప్రవచనాలను చెవిలోకి చొప్పించాను..


వాళ్ళు సగటుమనిషికన్నా ఎత్తయిన వాళ్ళా?
లేదా మరుగుజ్జు స్వరూపులా అన్న ప్రశ్నకు ఆస్కారం లేదు..

వాళ్ళు చెప్పిన వాటిలో వాస్తవికతే నన్ను వశపరుచుకుంది..

బోధి వృక్షం క్రింద జ్ఞానోదయమైన  క్షణాలు గుర్తుకొస్తున్నాయ్.
ప్రపంచ సర్వమత సమ్మేళనంలో వివేకానందుని బోధలు జ్ఞప్తికొస్తున్నాయ్..
ఇంక నాకు నీవంటే వెరపు ఉంటుందనుక్జుంటున్నావా?
మృత్యువా నీవు వెనుదిరిగి వెళ్ళడమేమేలని నా భావన
----------ఒక కవితను చదివిన నేపధ్యంతో]

Wednesday, April 27, 2016

సందిగ్ధ  సంధ్య
-------------------------రావెల
కవులెంత ఘరానా పెద్దమనుషులో
తెలుసా నీకు? ఇప్పటికిప్పుడు జరిగిన
 సంఘటలన్నింటినీ ఇట్టే మర్చిపోతుంటారు..
అలాగని మనల్నందరినీ సంభ్రమాశ్చర్యాలకు
లోను గావిస్తుంటారు..



నన్నయ దగ్గరనుండి నారాయణరెడ్డిగారిదాకా
కొన్ని పద్యాలను, కవిత్వ పాదాలను
 ఇట్టే స్పురణకుదెచ్చుకుని మురిసిపోతుంటారు..
అంతే కాదు నీ వు ప్రధమ సమాగం రోజున
ధరించిన దుస్తుల రంగులను ఇలాగే వల్లె వేయగల
సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తూంటారు..
నీవుజడలోతురిమినకదంబాలను గుర్తుపెట్టుకునే
జ్ఞాపకశక్తిని కలిగి వుంటారు..

ఒక్కోసారి నువ్వు చెప్పిన విధంగా చెట్లకు నీరుపోయడమో
చెత్తబుట్టను బయటకు గిరవాటుచేయడమో మరచిపోతుంటారు..
ఎండిన ఆకులనన్నీ ఒక సంచిలోకి ఎత్తి పెట్టమన్నావన్న
సంగతినే మరేచిపోయి ప్రవర్తిస్తుంటారు..

ఎందుకింత మతి మరుపును ప్రదర్శిస్తుంటారో ఇప్పటికి
నాకు అర్ధమయింది.. ఎన్నో ముఖ్యమైన విషయాలను
మనసు పొరల్లో భద్రపరచుకునే దిశలో దశలో
కొన్ని ఇలాంటి అతిముఖ్యం కాని విషయాలను
 ప్రక్కకు నెట్టేస్తూ కాలం గడిపేస్తూ కులసాగా జీవిస్తుంటారు..
[ఒక ఆంగ్ల కవితను చదివిన నేపధ్యంలో---]
=======================================================

Tuesday, April 26, 2016

ఆక్రోశపర్వం
-----------------రావెల


ఊటలూరని బావుల్లా
ఉక్కిరి బిక్కిరౌతున్న
మానవుల మనో వల్మీకాలు

శాఖాచంక్రమణలు చేయడానికి
తావుల్లేక తల్లడిల్లుతున్న పక్షి గణాలు..

నేలకు రాలిపడినా క్షణాల్లో
ఆవిరవడం ఖాయమని
అలమటిస్తున్న వానచినుకులు

ఇంకా ఏం బావుకోవాలని
 నీ తాపత్రయం సోదరా?

తాబేటికాయల ఊసులే మరచిపోయాం
నీళ్ళ సీసాలుకొనుక్కుని కంపెనీల
జేబులు నింపుతున్నాం.. సుఖలాలసులమై
రహదారులను నిర్మించుకుంటూ నేలనంతా
సిమెంట్ పరుపుల్లా మార్చేసుకుంటూ
కాలాన్ని  దుబారాగా వెచ్చిస్తున్నాం..

చల్లదనంకోసం చెట్టునీడలను ఆశ్రయించే వీలు లేక
సమశీతోష్ణపు గదుల్లో విశ్రమిస్తున్నాం!!
ఇంకా యేం సాధించాలని ఆధునికతకోసం
అంగలారుస్తూ ఆక్రోశిస్తున్నాం?
============================


Sunday, April 24, 2016

అడ్డంగానూ,నిలువుగానూ
కోతలకు గురవుతున్న నదిని
గుండెకు దగ్గారగా తెచ్చుకున్నాను
నిశ్శబ్దమే .. నన్ను విచిత్రంగా వరించింది

ఆటుపోటులకు అసలు సిసలు రూపమైన
సముద్రందగ్గరకు మనసునీడ్చుకుంటూ వెళ్ళాను.
అల్లకల్లోలమంతా నాకవగతమైనరీతిలోనే సాగింది..

అందుకే ఇలా నిస్త్రాణగా నిట్టూర్పుల గాడ్పులమధ్యన
సెగలుగక్కుతున్న శరీరాన్ని శాఖల్లేని తరువు దగ్గరకుచేర్చి
మౌనమె మూగరోదననుగా మార్చుకుని
నిశ్శేషంగామిగిలి వున్నాను..
===================================

Saturday, April 23, 2016

ప్రధమ సందర్శనలో
నీవు నా మాతృకకు
మరో రూపమని తలచాను..

మొదటిసారి నీ
 గొంతుక విన్నప్పుడు
అది అమృతకలశంలోనుండి
జారిపడే అనురాగ
 ధారలని ఉపమించాను.

మొదటిసారిగా నువ్వు
నన్ను స్పృశించినప్పుడు
వీణ తీగలను మీటుతున్న
స్పృహను యదార్ధంగా అనుభవించాను..

ఇప్పుడిలా నన్ను ఏకాకినిచేసి
నీవు తరలి వెళ్ళిపోతే
మ్రోడువారిన తరువులా కృశించాను..

మరో వసంతానికి బాటలు వేయని
ఆలోచనలను చేయంగల  వల్మీకంలో
నిద్రాణమై నిశ్వాసలను వెలువరిస్తున్నాను..
====================================











కాశీనాధుని తలపుల్
మూసీమూయని తలపుల మోహద్వారాల్
చూసినతోడనె జనులకు
వేసిన పూతివాసివోలె మెత్తగ తగులున్.

వెలుగుల నృత్యకేళి తన వెంబడితెచ్చెను హర్ష మోదముల్
కలబడి పూయసాగె నవ సుమమ్ములు లెక్కకుమించి పూవులన్
తలపులకొచ్చినంతనె తటిల్లతలై మెరసెంగద మేను తారకై
వలపులముద్రలే యిటు తలిర్చెను మేదినినందు మోహమై.

Friday, April 22, 2016

డెబ్భయ్యో పడిలోకడుగుపెట్టినా కూడా
నేను నిత్యం ఒక కొత్త మొక్కనయినా నాతూతుంటాను..
నన్ను నిష్ప్రయోజకుడిగా మాత్రం భావించకండిసుమా!!
నేనందరిలాకాదు.. నాటిన మొక్కలను
కంటికి రెప్పలాకాపాడుకుంటూ వుంటాను..
వాటిని పోషణలోనే అపరిమితానందాన్ని అనుభవిస్తుంటాను..

ముందుతరాలవారిసుఖ సంతోషాలు వీటి పెరుగుదలతోనే
ముడిపెట్టబడివుంటుందన్న ఒక్క ఆశనే
నన్నిట్లా శ్రమపడేలా చేస్తుంది---


భూమి పై పుట్టినందుకు నేను భారంగా
 కనిపించడం నాకిష్టంలేదు----

నేను ఆఖరి శ్వాస వదిలినా నేను నాటిన తరువులు
నాతర్వాత తరాలని ఆరోగ్యప్రదంగా శ్వాసించడానికి
సాయ పడుతాయన్న ఒక్క ఆశ నన్ను
హాయిగా యిలా  జీవించేలా సహకరిస్తుంది..
[12 వ శతాబ్దికి చెందిన చైనీస్ కవి కవిత  ఆధారంగా]

====================================================

Thursday, April 21, 2016

మావూరు పేరు వినగానే ఠక్కున గుర్తుకొచ్చేది
కిష్టయ్యగారు.పేరుకు గుడిపూడి రామకృష్ణయ్యే
అయినా అందరికీ పరిచయమైన పేరు కిష్టయ్యగారు.
ధనుర్మాసంలో దేవుడి చిత్రపటాన్ని పట్టుకుని నడిచేది
మా పిచ్చి సుబ్బాయ్యే అయినా ,వెనుకనుండి వెన్నెముకైనడిపే
నగర సంకీర్తనా చార్యుడు మా కిష్టయ్య గారే.
ఉద్యోగం గ్రామీణ వైద్య శాలలో అనధికారంగా కాంపౌండర్.
దాక్టరుగారికన్నా ఒకరకంగా చెప్పలంటే ఒక పిసరు
సిఫారసు గలిగిన వ్యక్తి ఈయనేనని మనం నిరాటంకంగా 
చెప్పుకోవచ్చు.ఊర్లో యే శుభభకార్యమైనా ఆయనకు ఆహ్వానమందకుండా 
ఆ కార్యక్రమం జరగదనే చెప్పుకోవాలి.

ఆయనలో భక్తిపారవశ్యం  మెండు.రోజూ ఒకరి ఇంట్లో క్రమం తప్పకుండా జ రిగే భజన కార్యక్రమంలో మాకిష్టయ్యగారుపదిసెట్ల తాళాలూ ,కంజీరా, ఢోల క్ ,గజ్జెలతో    హాజరవాల్సిందే.

భజన పూర్తవగానే భక్తవరుల్లో ఎవరోఒకరు ఆసంచీని వాళ్ళింట్లో ఆయన  చెప్పిన ప్రదేశంలో పెట్టివచ్చేవారు..

ఆయన దగ్గరున్న ఓ అద్భుతమైన కళ సెన్సారు వాడి కత్తెరతీసుకుని దిన,వారపత్రికల్లోని వాక్యాలను తనకనుకూలమైన రీతిలో కత్తిరించి, తలుపు చెక్కకో ఆయన ప్రత్యేకంగా అల్లించుకున్న తడికల గదికో అంటించి ఆనందపడ  డం .

ఆయనకు భార్యా వియోగమయినందున వళ్ళ ఇంట్లొ వెధరాలయిన అక్క పెళ్ళి మాటేత్తని తమ్ముడు అప్పయ్యా ఉండేవారు.కూతురు పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళింది అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా వవ్చి వెళ్ళేది.ఆయన కత్తిరింపుల కళాకౌశలం లో కొన్ని ఉదాహరణలు.

మైసూరులో దసరా ఉత్సవాలు
గుంటూరులో సత్యహరిశ్చంద్ర నాటకం

అదికాస్తా గుంటూరులో ఘనంగా దసరా ఉత్సవాలు
మైసూరులో సత్య హరిశ్చంద్రనాటక వైభవం.
అయి అందరినీ అలరించేవి.అదీ రాంకకృష్ణయ్యగారి ప్రతిభా ప్రభ. ఇలా ఇల్లంత  కత్తిరింపులూ అతికింపులే.

వాళ్ళక్క మాలక్షమ్మ గారినడిగితే ఆ మొదరొష్టపోడున్నాడుగా పనా ! పాటా!!  అన్నంతిని కూచ్చొని ఇలాంటి నిర్వాకమేదో చేస్తుంటా రు..
ఇక తమ్ముడు అప్పయ్యగారు ఎక్కువగా నులకమంచం అల్లుతూ[అదొకనిష్టగ చేయవలసిన కార్యక్రమము] గోగునారని చీల్చి ఎం డబెట్టీ   నారను పేనుతుంటాడు.ఆయన ప్రత్యేకత యేo టoటే
గోంగూర పులుసుకూరకూ గోంగూర నూరిన పచ్చళ్ళకు రుచికరంగా తిరగమోతలు పెట్టీవ్వడం .ఉదయం  పదిగంటలకల్లా సిబ్బిరేకులగినెలతోనో
రాచిప్పలతోనో జనం తయారు.తిరగ మోతలు పెట్టించుకోడానికి. 
ఈ కధాకమామిషును మాకిస్టయ్యగారి 
అక్రూరవరద గోవిందతో మొదలెట్టి ,    సమస్త హరిదాసులకూ జై అనేద్దాం. 
===================================================

Wednesday, April 20, 2016

పూలబుట్టతో ఈ నందనవనంలోకి
ప్రవేశించినప్పుడల్లాఇక్కడనీతో
చేయి చేయికలిపి తిరిగిన క్షణాలే
మధురాతి మధురంగా మనసులోకి
నాట్యంచేస్తూ ప్రవేశిస్తాయి..
మల్లెలు నీలానే నవ్వులొలకబోస్తూ
మనసారా మాటాడుతున్నాయా అనిపిస్తుంది..

మందారాలు అప్పుడప్పుడూ నువ్వు ప్రదర్శించే
చిరుకోపాన్నే గుర్తుకు తెచ్చి గొడవచేస్తుంటాయి..


గులాబీలు మాత్రం గుచ్చుకుంటాం సుమా జాగ్రత్త
అన్నట్లుగా దూరం దూరంగా జరిగేలా ప్రవర్తిస్తాయి..



పొన్నపూలు ప్రభాత సమయానికి రాలిపడినా
ఎంతగా పరిమళాను వెదజల్లుతాయో నీకెరుకేగదా!
పారిజాతాలు పరిమళభరితమై నన్ను అలరిస్తుంటాయి..
ఇక మరువం దవనం మొక్కలనంటుకోగానే హృదయగతమైన
ఆనందంక్షణాల్లోఆవిష్కృతమౌతుంది..

ఈమధ్య నాకు కవితకు ఓ చదువరి వ్యాఖ్యానంచేస్తూ వారికియేకవితనైనా పైకి చదివే అలవాటున్నదని ఈ కవిత
శ్రావ్యంగా వినబడిందనారు. చాలా సంతోషం కలిగింది.
వెంటనే నాకు బాల్యంలోని ఓ సంఘటన గుర్తుకొచ్చి అది ఇక్కడ ప్రస్తావించాలని తోచింది. మా స్వగ్రామంలో వెంకయ్యగారని ఓ గ్రామీణ వైద్యుండుడేవారు. ఆయనకు దిన పత్రికతో సహా యేదైనా పైకి చదివేఅలవాటు. అలాగే అపరాధ పరిశోధక నవలలు[అప్పట్లో పావలాకొకటి దొరికేవి.కొమ్మూరి సాంబశివరావు,తెంపోరావు లపేర్లమీద చాలా నవలలొచ్చేవి.కాడిలాక్ కారూ,పైపులోంచి పైకివచ్చే పొగలు అసిస్తెంట్ నందన్ లెదా మరో అందమైన యువతీ
ఇలా సాగే నవలలనూ ఆయన ఇంటి వద్దగానీ లేదా ఆయన అతుకు[అంటే ఏమిటని అమాయకంగా అడక్కండి.] తీరిగా నరసరావుపే కుర్చీ [ఈజీ చైర్ అనేవాళ్లు అప్పట్లో]
రీరిగా సిగరెట్ ముట్ట్తించుకుని పొగ వదులుతూ చదివే వారు
ఆనవలనో దినపత్రికనో, కానీ ఖర్చులేని కాలక్షేపంగదా అందరూ శ్రవణ పేయంగా ఆ కధాంశాన్ని విని ఆనందించే వారు.ఒచ్చిన చిక్కల్లా అక్కద మధ్యలో వచ్చే శృంగార సన్నివేశాలను కూలంకషంగా చదువుతుంటేనే శ్రోతలైన వారికి సిగ్గు మొగ్గలవుతూ విచ్చుకుని పెదాలు దాటి నవ్వుగా ముసి ముసిగా .రూపాంతరంచెంది బయటకు ఒచ్చేది..ఆ అతుకుమాత్రం నూలుచీరకొంగు అడ్దం పెట్టుకుని ఆయన వైపు ఓరచూపులు సారిస్తూ పకపకా నవ్వుకునేది.
==============================================

Sunday, April 17, 2016

మోడువారిన చెట్లపై
పక్షులెలా వాల్తాయి
ఒక వేళ వాలినా
అక్కడ ఏం బావుకుంటాయి..?

కోరికలుడిగిన దేహంలో
కారికలవి దరి చేరునా?
మబ్బుల్లేని ఆకాశం నుండి
వడగాలులు వీచునా?
వాసనలేని పూలకు
మనసు పరిమళించునా?



వానకు తెలుసు ఎప్పుడు పడితే
పంటపొలాలు హర్షిస్తాయో!!
వసంత యామినికి తెలియదా?
ఎప్పుడు భువిపై కేగుతెంచాలో!!
ఎండుబారిన గడ్డినంతా పచ్చని బయలుగా
తీర్చిదిద్దే ఘనత ఆమనికే స్వంతంగదా?


పూల చెట్లకు ప్రాణంపోసి
సురభిళాలనద్దండంకూడా
దాని ప్రత్యేకతలోని భాగమేగదా?
హృదయగతానందానికి
వసంతంతప్ప వేరు ఋతువుకు వీలవుతుందా?
=========================================

Friday, April 15, 2016

అవును నీవన్నది నిజమే
మనిద్దరం మరొక్కసారి
ఏకాంతంగా మాట్లాడుకుందాం
అపార్ధాలను,అపోహలను చర్చలతో
సామరస్య ధోరణిలో పరిష్కరించుకుందాం!
చెరువుమీద అలగడం వలన మనమే
అపరిశుభ్రతకు తావిచ్చిన వాళ్ళమవుతాం..
వీచే గాలి ఎల్లవేళలా మనసుకు
ఆనందం కలిగించాలని నిబంధనలేం వుండవుకదా?
మనస్పర్ధలు మనమధ్యన మనమేర్పచుకున్నవేగదా?
అంతరంగాల్లో ఆశ్రయం పొందిన అహం,అసూయలను
ఆవేశకావేషాలకులోనయి చేసుకున్న వ్యర్ధమైన
ఆరోపణలనన్నింటినీ ముఖాముఖి చర్చలతో
అవకశమున్నామేరకు పటాపంచ్చలు చేసుకుందాం..

కాలంపరుగును లంకించుకుని మనకు అందనంత దూరంగా
దిగంతాలదరికి జరిగిపోయేలోపు మనలో మనమే ఆమోదయోగ్యమైన
పరిష్కారాన్ని ప్రతిపాదించుకుని సమన్వయంతో సాగిపోదాం..

ఒకమెట్టో రెండుమెట్లో దిగడానికి ఇద్దరం మానసికంగా
ముందస్తుగా సిద్ధమయి మునిపంటిని నొక్కకుండా సామరస్య ధోరణిలో
ముందుకు సాగుదాం..మనచేతుల్లోలేని దేమీలేదని ముందుతరాలవారికి
ముఖ్యమైన సూచనలను చేసేలా ప్రవర్తనను సరిదిద్దుకుందాం..
================================================

Thursday, April 14, 2016

వలపు గుడిలోన దేవత తరలిపోయె
ఏకలవ్యుని సాధనే ఇటులమిగిలె
ఏమి శాపమొ పాపమొ యెరుగనైతి
పట్టి యాతని పాదాలు విడువ నంటి..

Wednesday, April 13, 2016

అస్తమించబోయే సూరీడు
తనచుట్టూ వున్న ఆకాశాన్ని
అంత అందమైన రంగుల చిత్రంగా
మలుచుకుని ఆ వర్ణ మహోదధిలో
తలస్నానం చేయాలనిఎందుకు  భావిస్తాడో
మొన్నటిదాకా అర్ధమయేదికాదు...సుమా!!

ఉదయించబోయే అందాల చందమామ
పండు వెన్నెలను పిండారబోసినట్లుగా
పరిచి ఆనందాన్ని ఆ ముఖమ్మల్ తివాసీపై
నడిపించుకుంటూ ,  ఎందుకిలా భువికి చేరుకుంటాడోకూడా
అంత తొందరగా నా చిట్టిబుర్రకు తట్టేదికూడాకాదు..

ప్రాచీన సాహిత్య పరంగా  యే కావ్యాన్ని చదివినా
అష్టాదశవర్ణాలతో కావ్యేతితివృత్తాన్ని   అలా
ప్రబంధపు బిగి కౌగిలిలోకిబిగియజేసి
 చదువరికిఊపిరాడకుండా చేస్తుండే వారోకూడా
ఎన్ని సార్లు వల్లెవేసినా అంత
 సులుసూత్రంగా అర్ధమయేదికాదు--

భావకవితా సీమలో ఊహా ప్రేయసికోసం
పగలైనా,రాత్రయినా అలా పరవశించిపోతూ
పల్లవించడానికి సమాయత్తమై, తరూశాఖలపై
గట్టిగా కట్టిన ఊయలలో  చివురుజొంపాలకుమల్లే , ఊగే కన్నెపిల్లలా
కోయిలమ్మ గీతికలా ,మృధు మధుర స్వరమై
గానలహరిలో మునుగుతూ తేలుతూ ఆనంద వార్ధిలో
అమందానంద కందళిత హృదయారవిందులౌతుంటారో
ఎంతగా ఆలోచించినా ఒక పట్టాన  అవగతమయేది కాదు..

ఇవన్నీ మధుకీలలనంటుకున్న ప్రణయ వాతూలహతిన
గాఢంగా తనను పదహా రణాలా  విశ్వసించిన అమాయకులైన
అజ్ఞానంపు  మానవాళినిప్రళయాగ్నిన  బడద్రోయు మార్గమని
   కూలంకషంగా గుర్తెరిగి , మౌన స్వామినై
నిశ్శబ్దములైన నిముషములవేగాని , వేరుగాదని  నెమ్మదితో తెలుసుకొంటి....
ఇక ప్రవాసమే ప్రల్లదులపాలిటి స్వర్గ సీమయని చాటుచుంటి..
==============================================
రామకధలను విన్నంత రక్తి కలుగు
సీత చరితను చదివిన చింత హెచ్చు
లక్ష్మణయ్యకు దక్కెను  అన్న ప్రేమ
హనుమ సాటికి దరిజేరు ఘనులు గలరె..

కనుమరుగవుతున్న
పచ్చదనానికి
కళా కాంతీ
సమకూర్చాలన్న తపన
దళారుల జేబుల్లోకి
తస్కరింపబడుతున్న
అటవీ సంపదను ఆదుకుని
 సం రక్షించాలన్న ఆతృత
మనిషిలో నానాటికీ మృగ్యమౌతున్న
మానవతను మరలా
పునరుద్ధరించగలనన్న ధీమా
నన్ను మనీషిగా రూపాంతరం చెందమని
అత్యవసరంగా ఆదేశాలను జారీ చేసాయి..
====================================

Tuesday, April 12, 2016

మంత్రపుష్పం
ఆ వొడ్డుననీవు
ఈ వొడ్డున నేను
ఇద్దరిమధ్యా అగాధంలా
నిరంతరం ప్రవహించే నిశ్శబ్దం

నేనేమో ఆ తీరందరికి
ఎప్పుడు చేరుకుంటానో ఎరుకవదు
నీనవ్వుల సవ్వడిలో ఎప్పుడు
ఓలలాడగలనో తెలియదు

విషాదం వల విసిరినా
వియోగం వంచించినా
కాలం యెర్పరచే గాయం మానేదాకా
కలతెందుకు?వగపెందుకు?

నీకళ్ళకో భాషవుంది
నీ హృదయానికి ఓ నిర్వచనం వుంది
నిరంతరం ప్రణయ పాదోధిలో మునకలేసే నీకు
విందుగా వుండాలనే ఈకవితనల్లాను.

మలయమారుతం వీచినప్పుడల్లా
నీ వూసులే నెమరేస్తుంటాను
ఈ ప్రణయమహొదధి అంతా అల్లకల్లోలమై
ఆఖరి ప్రమాద హెచ్చరిక వెలువడేదాకా
నీ ధ్యాసలోనేశ్వాసిస్తూజీవిస్తాను

చీకటి వెల్లువై వరదలా పొంగివస్తే
కొన్నిక్షణాలపాటైనా తలొంచక తప్పదు.
దిగులేలవగలేల?
రా !! మనం వలపు పందిరిక్రింద
ప్రణయమంత్రం జపిద్దాం
వలపు పుష్పాలతో
సుమసౌరభం వెదజల్లుతూ
మంత్రపుష్పం పఠిద్దాం
**********************

Monday, April 11, 2016

వసంత గానం
--------------------


రాలిపడిన అనేక వర్ణపత్రాలన్నీ
ధరణీ మాతకు ప్రమాణం చేస్తున్నరీతి
మనసుపొరల్లోనుంచి చెదరిపోకముందే
వసంతం శోభాయమైన హరిత జగత్తును
వెంటబెట్టుని వచ్చింది..కులాసాగా దిలాసాగా
మ్రోడు వారి ఇక మృతప్రాయమనుకున్న తరువులన్నీ
జీవలతికలను గాఢంగా కౌగిలించుకున్న అపురూప  దృశ్యం
మనోహరమై,మనోజ్ఞమై మనిషిని ఆహ్లాదపరుస్తున్నది..

దు:ఖభాజనమై నిన్నటిదాకా నిరాశాజనకమై
దిగులు మొదళ్ళతో దిగాలుపడిన ప్రకృతిమాత
నవనవోన్మేషమై నయగారాలుపోతూ
నడచివస్తున్నట్లనిపిస్తున్నది---

ప్రతి ఇంటిముందూ పచ్చని తివాసీ పరిచిన పచ్చిక బయలు
వసంత యామినికి హార్దిక స్వాగత సత్కారలందించడానికి
సమాయత్తమౌతున్నతీరు ప్రశంసార్హమై విరాజిల్లుతున్నది..

ప్రతి ఇంటికి ముందూ పచ్చిక బయళ్ళలో ఒదిగిపోయి
 శిశిరరుతువంటటా  వసివాడి తలలు వాల్చిన పూలమొక్కలు
మా నవ మన్మధుడు వచ్చాడన్న సంతోషంతో శిరసులెత్తుకుని
వీచేచిరుగాలులకు తలలూపుతూ సంగీత సమ్మేళనంలో..
గాలి వేస్తున్న ఈలపాటలకు ఘనా ఘన సుందరుని కీర్తించే
ఘంటసాలవారి గానామృతాన్నాలకించే రసజ్ఞలోకంలో
తన్మయత్వంతో తొణికిసలాడుతున్న శ్రోతలను మరపిస్తున్నాయి.
వయ్యారిభామల నృత్య ప్రదర్శనలా ఈ వసంత శోభ
మనసులను మరో మహత్తర జగత్తులోకి నడిపించే మార్గదర్శియేకదా!!
=====================================================
కొన్ని పక్షులు గాలిలోగిరికీలు కొడుతూ
విహంగ విన్యాసాలుచేస్తూ విచలిత
ఆనందాన్ననుభవిస్తాయి.
గాలితోపాటు ఎగుడుదిగుడుగా జారిపడుతూ
అప్పటికప్పుడే నిలదొక్కుకుంటూ
అనూహ్యంగా నవ్వును  తెప్పిస్తాయి.

నీటిప్రవాహంలో కొన్ని జంతువులు
నిర్దాక్షిణ్యంగా కొట్టుకుపోతుంటాయి..

ఉదయాన్నే పచ్చిక బయలులో గడ్డిపోచలపై
హిమబిందువులు ముత్యాలలాగా మెరిసిపోతుంటాయి..

సాలెపురుగు తన ఆహారంకోసం కట్టుకున్న గూడంతా
కలియదిరిగి ఎప్పుడు దొరుకుతుందా అని వేచిచూస్తుంటుంది.

భగవంతుని సామ్రాజ్యంలోకూడా శ్రీనివాసుల
సిఫారసులకే అత్యధిక ప్రాధాన్యం లభిస్తుంది..

ప్రకృతి తన సుమసౌరభంపు గుబాళిపులను పీల్చి
పరవశమతో ప్రసిద్ధంగా నాట్యం చేస్తుంటుంది..

కానీ నేనొక్కడిని మాత్రం ఏకాంతంగా
వేలకొద్దీ బాధలను ఒంటరిగానే అనుభవిస్తూ
గతస్మృతులను కరాఖండీగా నెమరువేస్తూ
వర్తమానంలోకి తొంగిచూస్తూ జీవితం గడుపుతున్నాను..
[ TUFU ---  చైనీస్ కవితకు అనుసరణ ]


Sunday, April 10, 2016

 అధర్మో భక్షతి భక్షితః------
                                                          [1]
స్వామీజీ పర్యటిస్తున్నారంటే అక్కడ చుట్టు పక్కలపాతిక  గ్రామాలకు ,వారి అనుంగు శిష్యులు పదిరోజులుముందుగానే వచ్చి స్వామీజీ వారి  అద్భుత  లీలను  మహిమలను స్వయంగా  వారు వైద్య పరిభాషలో అత్యద్భుతం గా పరిగణించదగిన  మహిమలను ,ఇంకా యెన్నో మొండి రోగాలను  వారు చిటికెలో మటు మాయం చేసిన కధనాలను,
 గ్రామ గ్రామాన వినిపి స్తూ ఉంటారు .స్వామీజీవారిని పలురకాల సేవలతో పూజించి పునీతం కమ్మని హిత బోధ చేస్తుంటారుస్వామీజీ వారు ఇలా వారి నగరానికి విచ్చేయడ0ఆయా గ్రామాలవారి,
 మరియూ వారి పూర్వీకుల  పూర్వ జన్మ సుకృతమనీ చెపుతూ వుంటారు .
 
స్వామీజీ చేయలేని సేవాకార్యక్రమాలు లేవని మానవ సేవే మాధవ సేవని  నమ్మిన మహానుభావుడని అందరికీ అడిగినా అడగక పోయినా యేకరువు పెడుతుంటారు.
అది వారి ప్రచారపర్వంలో భాగం మాత్రమేనని మనం గమనించ గలగాలి.
స్వామీజీ సేవలోపునీతం కవాలని అగ్రభాగంలో ఉంటూ వారికి అనునిత్యం చేదోడు వా దోడు గాఉంటూ0డాలని వారి జీవితాశయం తపన గూడాస్వామీజీ ఇటీవలి కాలంలో ఎక్కువ భాగం విదెశీ పర్యటనలో గడుపుతున్నారనీ దానికి కారణం ఆయన హైదరాబాదులో నిర్మిస్తున్న  వికలాంగుల ఆసుపత్రి వ్రృద్ధాశ్రమం  కొరకు నిధుల సేకరణె లక్ష్యమని తెలిసినా శిష్యులు  మాత్రం అక్కడ శిష్య పరమాణూవుల ఒత్తిడి మేరకే వెళ్ళ వలసి వస్తుందనీ వివరిస్తుంటారుఆయనమీద ఎవరూ పల్లెత్తు మాట అనకుండా ప్రతిక్షణం జాగ్రత్త పడుతుంటారు . వారి పాదసేవకోసం ఇప్పుడే చందా వ్రాసుకోవడం మేలనీ, రాను రానూ ఆక్తి గల భక్తులు సంఖ్య పెరిగేకొద్దీ చందా సొమ్ము పెరిగే అవకాశం ఉంటుందనీ కొద్ది కొద్దిగా ఆందోళన పెడుతూ, తమ పబ్బం గడుపుకుంటూ ఉంటారు.
అక్కడ విదేశాల్లో వీళ్ళు చెప్పినట్లు ఆక్కడి భక్తగణం తపన పడడ0
లేదనీ కొందరు ముఖ్య భక్తులు ఈయన పెట్టే మొహమాటాలూ చదాలకోసం వాళ్ళను పెట్టే పాట్లూ భరించలేక స్వామివారు విదేశీ పర్యటనన ఖరారు కాగానే ప్రీమియం రేట్లలోనయినాసరే విమానం  టిక్కెట్లు  కొనీ మరీ ఇండియాకి పరుగెట్టుకు వస్తున్నట్లు సమా చారం.
ఇవన్నీ ఎలాగున్నా అమాయకులను డబ్బుకో సం మోసం చేయడం మాత్రం నిరాటంకంగా జరుగుతూనే వునంది సందడిలోనే వైజాగ్ నించి సుభాషిణి అనే అరవయ్యే ళ్ళ ఆడకూతురు చెప్పిన కధవింటే ఈస్వాములోర్లు ఎందుకోసం ఇలా
మాయా చెస్తున్నారో అర్ధం కాదుఆవిడ భర్తకు ఆరోగ్యం బాగాలేక స్వామీజిని కలిసి కష్టాలూ చెప్పుకుందామని ఆయన్ను కూడా తీసుకుని ఒచ్చింది ఆమెతో స్వామీజీ 30 వేలు తీసుకుని 10 నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చారువెళ్ళగానే ఆయన ఆరోగ్యాని వాళ్ళా ఇంటికున్న వాస్తు దోషం కారణమనీ అది వాళ్ళ పేరిటౌన్నంత కాలం ఆయన ఆరోగ్య స్థితి క్షీణిస్తుందేగాని మెరుగుపడదనీ చెప్పడంటొ ఆమే డీలా పడిపోయింది నిస్త్రాణగాఅదేమితి స్వామీజీ అది మా అత్తగారి
                                         [2]
దగ్గరనుండి వస్తున్న ఆస్తిమా అత్తా మమా పూర్ణాయుష్కులుగా జీవించారు . ఆయన వారసుదే గదా ఈయనకెందుకు వాస్తు అడ్డొస్తుంది ? అని అడిగింది.
స్వామీజీ ఇంతెత్తుగా కోపం వచ్చిందిస్వామీజీలు కూడా కోప తాపాలకతీతులు కాదా అని అనుమానమొచ్చింది ఆమెకు.
స్వామీజీ వెంటనే శిష్యులను కేకేసి  ఎందుకు ఇలాంటి స్వామివారి మాటలమీద నమ్మకం లేని వారిని పంపిస్తారు . ఆమెకు నామీద నా మాటలమీద  నమ్మకం కలిగించి పంపం డి లేదా చేజేతులా ఈవిడ ఆయన్ను దూరం చేసుకుంటుందో సిద్ధం కమ్మనండి .అని విసురుగా పూజా మందిరంలోకి రుస రుస లాడుతూ వెళ్లి పోయారు
ఆమె స్వామివారి తీరుకు నిరుత్తర అయింది .ఎదోలా  ఆయనను కాపాదుకో వాలనే నినయానికి ఒచ్చిందిఆస్తులు ఎప్పుడయినా సంపాదించుకోవచ్చు .ప్రాణం కాపాడూ కుంటానని నిర్ణయించుకుంది. ఆవిడ ఆవేదనా తప్త హృదయంతో గుద్లల్లో నీరుకుక్కుకుంటూ సామీజీ దగరకు బిక్కు బిక్కుమంటూ ఒచ్చింది.
స్వామీ జీ కసురుతున్నట్లే మాట్లడుతూ  యెమ్మా మల్లెందుకు ఒచ్చి నన్ను వ్సిగిస్తావుఈకు మీ ఆయన ప్రాణం కన్నా అశాశ్వతమైన ఆస్తిపాస్తులమీదే  మక్కువ ఇంకా నేనేం మాట్లాడగలను చెప్పు . నీవెలగనుకుంటే అలాగే చేయ్ . నన్ను ఇంకేమాత్రం విసిగించకు అంటూ
కసురుకున్నారుఇక ఆసుమంగంగళి చేసేదేమీలేక .ఆయన పాదాలమీఎద పడి గజేంద్రమోఖంలో మొసలిబారిన పడ్డ యేనుగులా నీవే తప్ప అన్యధా శరణం నాస్తి అన్న పద్ధతిలో పాదాక్రాంతమయిందిఅప్పుడు స్వామీజీ శిష్యులలో అతిముఖ్యుడు ఆమె దగ్గరకొచ్చి అమ్మా!! మీకున్న  వాస్తు దోషంగల ఆస్తిమీపేరున ఉన్నంతవరకూ మీకీ గ్రహదోషపు కష్టాలు తప్పవు