Tuesday, January 26, 2016

వినతిపత్రం
---------------రావెల.

నవ్వుకోసం నిరంతరం
అన్వేషణప్రారంభించాను.
నానాటికీ నరులమధ్యన
అనుబంధాలమరుగున
మృగ్యమైపోతున్న నవ్వుకోసం
నల్దిశలా వెదుకులాటమొదలెట్టాను.

అధోజగత్సహోదరులమధ్య
 అమరజీవియనుకున్న నవ్వు
అదృశ్యమైపోతున్న నవ్వుకోసమే
అన్వేషణకొనసాగిస్తున్నాను.

పూలు ప్రభాతసమయానికల్లా
నవ్వుతూ శుభోదయం పలుకుతున్నాయ్.
ఇంటికి అతిసమీపంలో ప్రవహిస్తున్న
సెలయేరుకూడా విరామమెరుగకుండా
ఉరుకులు పరుగులతో జలజలా పారుతూ
గలగలా నవ్వుతూ పరుగులుదీస్తున్నది.


కొష్టాల్లో గుంజలకు కట్టివేసిన
పశువులుకూడా మేతనెమరువేస్తూనే
తమలోతామే మరువకుండా నవ్వుతున్నాయ్.
మరి ఈ మానవజాతికెందుకో ఈ మతిమరుపు
నడమంత్రంగా సాక్షాత్కరించుకొచ్చింది.
విద్వేషాలవిరిదండలను వైపు ప్రేమను
ప్రకటిస్తూ నవ్వును మరచి ప్రవర్తిస్తున్నది.

నవ్వు మనుషులకు నాజూకుదనం నేర్పుతుంది.
నయగారాలొలకబోసినాసరే
నవనవోన్మేషమై వికసించేలా సాయపడుతుంది.

నవ్వునాలుగురకాల చేటన్నవారిమాటపట్టుకుని
ససేమిరానవ్వం పొమ్మంటూ భీష్మించుకు కూర్చుంటున్నారు.
నవ్వేగదా నాపచేనునైనా పండిచగలసత్తా గలది.
అందుకే నవ్వునుమాత్రం మరువకండని వినమ్రంగా
వినతిపత్రం సమర్పించి సెలవుదీసుకుంటాను!
==================================

No comments:

Post a Comment