Monday, May 2, 2016

నిన్నటిదాకా దిస మొలతో
నిలబడడమే దైనందిన
చర్యగా భావించాను..
గాఢ సుషుప్తిలో కనులు
 మూయడమే ఖాయమని
భావించి కృశించాను----
హేమంతంలో, శరత్తులో
ఎముకలు కొరికే చలిలో
జీర్ణిస్తూ జీవించాను..

అతడొక పిల్ల తెమ్మెరలా
నా తనువునంతటినీ తడుముతూ
పులకరింపజేసాడు..
లేచివురుల నునులేత స్పర్శతో
ననవోన్మేషంగా
తయారయేలా చేసాడు..
ఇప్పుడిలా సుతిమెత్తని చివురుల
చిరుమందహాసాల చిత్తడి నన్ను
చైతన్య శిఖరమనుకునేలా చేసాయి..
అతడికి నేనేమిచ్చి నా రుణం తీర్చుకోగలను?
మళ్ళీ మరోరుతువు ఆగమించేదాకా
మందహాసాల మృదు హాసాలతో
చూపరులను చకచ్చకితం చేస్తూ
నిత్య హరితనై నిభాయించుకుంటాను..
అతడి చూపుల ఉయ్యాలలో
 జగజ్జేగీయమానంగా వెలుగుతూ
అలరిస్తూ జగాన విజేతగా మురుస్తాను..
వసంత యామినినై ఆమనిషిగా
అవతరిస్తూనే అనుసరిస్తాను..
అనునయంగా జీవిత సాఫల్యానికి
ఆనంద నందన వనమై చరిస్తాను
===============================

No comments:

Post a Comment