Monday, May 30, 2016

సంఘర్షణల సమరంగణంలో
------------------------రావెల
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్
ఈలనోట్లోపెట్టుకుని గోలగా ఊదే
పసిప్రాయం వారిది--
మీసాలు గడ్డాలతోఇంకా
ప్రముఖంగా పరిచయంలేని
యవ్వనం ఇంకొందరిది---

ముందుకు అడుగులేసే యోగం కనరాదు..
వెనుకకు మరళివెళ్ళగల సాహసం చేయలేరు--
ముందూ వెనుకనా ఆయుధ ధారులైన కర్కోటకులే--

ఎటుతిరిగిచూసినా కరుణంటే అర్ధంతెలియని
కర్కశ హృదయుల ఆవాసమే అక్కడ..
నవ్వు సజీవంగా వారిమధ్యన
శ్వాసించివుందోలెదోకూడా అనుమానమే--

మాట బయటక పొర్లితే--మహాపరాధం..
ఎదురుతిరగడమన్న ఆలోచనే అసలు స్ఫురించదు..
అందుకే అక్కడందరూ అప్పిసెం మౌనానాశ్రయించిన
ముభావంగా వుండే వారే దర్శనమిస్తుంటారు..

తూర్పూపడమరలమధ్యన
సుప్రభాతగీతల వూసే వినిపించదు..
పవళింపు సేవలూ కేవలం ప్రహేళికల్లా కంపడుతుంటాయి..

అంతా బలిపీఠానికి సిద్ధమయి తరలివెడలే
మూగజీవుల ఊరేగింపుల్లానే ముందుకు నడుస్తుంటాయి..
తూర్యనాదాలన్నీ తుపాకీలమ్రోతలే సుమా!!
సంఘర్షణలమధ్యన సమరాంగణంలో సాగే సదసత్సంశయం ఇది..
ఉద్రిక్త పరిస్థితుల మధ్యన ఊపిరాడని జనజీవనానికి
సోదాహరణమైన కావ్య ప్రబంధంలావుంది.. ..


[ఒక దేశం మరోదేశం సరిహద్దుల్లో జరిపే సమరాల్లో-- పసివారిని,
ముక్కుపచ్చలారని ముద్దు బిడ్దలని అడ్డంపెట్టుకుని సాగించే
సమరఘోష..]
[ఒక ఆంగ్లకవిత ఆధారంగా అల్లినకవిత]
===========================================

Saturday, May 28, 2016

వృక్ష దీక్ష
-------------------రావెల
********************************

గృహ ప్రాంగణాల్లో
తరాల తరబడితలలూపుతూ
గ్రీష్మానికల్లా గీరబోకుండా
తననీడను విస్తరింపజేస్తున్న
తరువులకు తనివిదీరా  ప్రణమిల్లుదాం..

మేడమీదకు గోడవారుగా
ఎగబ్రాకుతూ అమ్మ వొడినిండా
నిండిపోయి నవ్వులను వెలయించే
సన్నజాజులను,మల్లియ పాదులను
రెండు చేతులా కాపాడుతూ
అమ్మ ఆనందానికి
 వెల్లువలేనే లేదని
చాటుదాం..---

ఊరుముందర శిధిలావస్థకు
చేరుకోబోతున్న తోపులో రకరకాల
పూలమొక్కలను నాటి వాటిని
అక్కడ వెలసియున్న పరామాత్మస్వరూపునికి
పూజాసుమాలుగా సమర్పించుకునేందుకు కృషి చేద్దాం..


ఊరిముందరున్న చెరువుచుట్టూరా ఫలసాయాన్నందిచే
వృక్షాలను పెంచిపోషిస్తూ సారవంతమైన
హృదయ దఘ్నమైన ప్రేమకు మావూరే ప్రతిరూపమని
సోదాహరణంగా నిరూపణలతొ రుజువుచేదాం రండి
ఈ వృక్ష దీక్షలో అందరం భాగ స్వాన్యులమై
మన ప్రేమాతిరేకాన్ని అక్షరాలా నిరూపించుదాం..

=======================================================

Thursday, May 26, 2016

మనిషినీ మనసునూ
ప్రేమించలేకపోతున్నాను
నన్ను ద్వేషంతోకాదు సుమా!
దోషభూయిష్టం కాని నీ  నయనాలతో
నన్ను నడిసంద్రంలోకి శాశ్వతంగా నెట్టేసేయ్..

మతధర్మాలను సంస్కృతీ సంప్రదాయాలను
గౌరవించడం మానేసి దశాబ్దాలు దొర్లి పోతున్నాయ్..
సంస్కార హీనతకు చోటివ్వని నీ కరకమలాలతో
నన్ను కారడవుల పాల్జేసి నీ కర్తవ్యం నెరవేర్చుకో!!

పద్య మర్మాలను తెలియక ప్రబంధాలను దూషించాను
కరుణ గలిగి రసాద్రమై చిప్పిల్లే నీ పదగుంఫనలతో
నన్ను కావ్య బాహ్యుడిని గావించి నిన్ను నీవు సంబాళించుకో--
======================================

Tuesday, May 24, 2016

అతను అందరూ మెచ్చి నచ్చిన కవి
తన జీవిత భాగస్వామిపై ప్రణయ గీతాలను రచించి
ప్రేమికుల హృదయాలలో ప్రముఖమైన స్థానాన్నలంకరించాడు..
తన కవిత్త్వ సంపుటికి విశేష ప్రజాదరణను సంపాదించాడు..

ఒకరోజు ఆమే నిశ్చలంగా కుర్చీలోకూలబడివుంటే
 జీవన మర్మం గురించి వ్రాసిన కవితను ఎప్పటిలాగే
ఆమెకు చదివి వినిపించి ప్రత్యుత్తరం రానందుకు
 ఖేదపడుతూ ఆమెను కుదిపి కదిపాడు..
అప్పటికే ఆమె ప్రాణాలు గాలిలోకలిసాయని తెలిసి
విషణ్ణవదనంతో ఏకోన్ముఖంగా విలపించి పోయాడు..

ప్రణయం ప్రళయమై గర్జించిందని ఘూర్ణిల్లాడు,..

అలా బాధతో వెలార్చిన విరహ గీతాలను
 భద్రంగా ఆమె శవపేటికలో భద్రపరిచి
తన దు:ఖానికి కొంత ఉపశమనం పొందాడు..

ఏడేళ్ళు కాలెండర్ కాగితాలు ఊడిపోయి నేలకు రాలాక అతనికి
ఆకవితలకు నకలులు తీయడం మరిచిపోయానని గుర్తుకొచ్చింది..
కొందరు కూలీలను పిలిచి ఖననం చేసిన పేటికను దూరంగా వుండి
బయటకు తీయించాడు..ఏవో వజ్రాలో , వైఢూర్యాలో అక్కడ వుంచి
మరచిపోయివుంటాడని ఆ శ్రామికులు భావించి ఇతోధికంగాశ్రమి0చి
 పలుగూ పారలతో  దాన్ని తవ్వి  పేటికను బయటకు లాగారు..
అందులోని ముచ్చటగా పేర్చిన మూడు కాగితాలను తెమ్మన్న అతనిని చూసి
ఒక పిచ్చి మాలోకం ఈ లోకానికి దిగివచ్చాడని నవ్వుకుంటూ సంబరపడిపోయారు..


ఇంటికి వచ్చాక తమతమ శ్రీమతులను చూడగానే తమ భార్యలకు ముందు ముందు
 ఏ బహుమతులనివ్వాలో తలచుకుంటూ మతులను పోగొట్టుకుని
మూర్తీభవించిన శిలల్లా శేష జీవితం గడపుతూ కవిగారు ప్రకటించిన
ప్రేమకు శాశ్వతంగా
కృతజ్ఞతాపూర్వకంగా బందీలుగా మిగిలిపోయారు.
[ఒక ఆంగ్ల కవిత చదివిన నేపధ్యంలో]

======================================



ఒక గ్రీష్మర్తువు మిట్ట మధ్యాహ్న  సమయాన

==============================రావెల
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఊపిరాడని ఊళ్ళన్నీ ఉరేసుకోవడానికి సిద్ధమవుతున్నరోజుల్లో
ఊరిముందర నీరంటూ,  చెట్టంటూలేని చెరువుగట్టు మీద
రచ్చచేసే బండలమీద వృధాప్రయాసల చర్చలు మొదలయ్యాయి..
ఎన్నికలంటూలేనిరోజుల్లో పైచొక్కాలకు పనేముందని భుజం మీద పనిలేని
 కండువా క్రిందకు దిగొచ్చి గుండెమీదకు నేరుగా పంకాలామారి  గాలిని విసరడం ప్రారంభించింది..
వార్తాప్రసారాలపేరిట పెట్టుబడిదారులు ప్రభుత్వం మీద ప్రేమప్రకటించేందుకు
 పెట్టుకున్న పత్రికలు వుబుసుపోని పల్లెలకువిసనకర్రలబదులుగూ పత్ర హరితమైన పత్రికలను శుభోదయాత్పూర్వమే పంపిణీనిమొదలుపెట్టి మానసిక కాలుష్యపు కారకాలై
చెరగని తమ ముద్రలు వేస్తూ విషయంలేని విషపు నవ్వులుపూయిస్తున్నాయి.
పగలంతా ఉక్కపోతలతో ఊరేగుతున్న జన ప్రాణాలు
రాత్రయేసరికి పంకాలవైపు పిచ్చిచూపులు...
తాతల కాలమె నయం కరెంటంటూలేకపోయినా
చెట్లంటూ ఉండి కొంతలోకొంతయినా ఊపిరి సలుపుకునే వీలుండేది
ఇప్పుడిలానడమంత్రపు సిరిరోజులు దాపురించాకా ప్రెమాభిమానాలు
అనురాగానుభూతులూ అన్నీ కృత్రిమమఏ అయి పోయి ఆధునికతను
అపహాస్యంచేస్తూ ఆటపట్టిస్తున్నాయ్..తరువుల ఊసేలేని తరంలోకి
జొరబడిపోయి వూపిరంటూ ఆడక ఉక్కిరి బిక్కిరై సతమతమవుతున్నాం..


===========================================================
నిశ్శబ్దవనం
----------------------రావెల
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్

ఏ దృశ్యాన్ని ఎప్పటికీ చూడకూడదనుకున్నానో
ఆ దృశ్యమే ఇవ్వాళనా కంటికి ఎదురొచ్చి నిలబడింది..
ఒక వైపు ప్రాణికోటికి ఊపిరూలూదుతూ తలల తాటించే తరూ సమూహం..
మరో వైపు జీవన్మరణసమస్యలో ఉస్సురుస్సురంటున్న పేదరికం
వీటన్నిటినీ కలగలుపుతూ ఒకేగాటన కట్టేసి కాలం తీరేసరికి
తనఒడిలోకి శాశ్వతంగాలాక్కుని నిశ్శబ్దంగా నిద్రపుచ్చుతున్న
స్మశానస్థలం..అక్కడే చివరకు శాశ్వతంగా స్థిరపడిపోక తప్పని
 మూగజీవులైన వారి నిశ్శబ్దపు నిట్టూర్పులు..

ఎంతగా బ్రతికినన్నాళ్ళూ భ్రమలలోకంలో విహరిస్తూ ముందు ఏడు తరాలకు సరిపోయే విధంగా సంపాదించడంకోసం క్రిందా మీదాపడుతూ , తపనపడుతున్న పెద్దరికం..
ఎదిగి ఎగిరెగిరిగిపోయామని నింగినుంచి నేలకు నిచ్చెనలతో ఎగ బ్రాకినా
శాశ్వతంగా నాలుగడుగులలోతులో ఏడడుగులా బారున వొదిగిపోక తప్పదని
తెలిసికోలేకపోతున్న అవివేకం అజ్ఞానం..   24-5-16
===========================================
నీలాకాశంలో రెక్కలను
విదుల్చుకుంటూ పయనించే
ప్రతి విహంగమూ నాకొక
కవితేతివృత్తంగానే సాక్షాత్కరిస్తుంది--
పర్వత సానువుల్లో తన నృత్య
భంగిమలతో అలరించే ప్రతినెమలీ
నాకు భరతుడి నాట్యశాస్త్రాన్నధ్యయనంచేసిన
నృత్యకళాకారిణిలానే ద్యోతకమవుతుంది..
తరూలతలతో పాటు సమ్మోహన పరిచే
ప్రతికోయిలమ్మా నాకు సంగీతాభ్యసనంచేసే
గానకళాభిరక్తులుగానే ద్యోతకమవుతుంటుంది..
ప్రకృతితో తాదాత్మ్యంచెందే ప్రత్యణువూ నాకు
ప్రత్యక్ష దైవంగానే గోచరిస్తుంటుంది..

మానవజీవనం ఎంత శ్రోత్రియమైనదోనని అనిపించే
ఆశ్చర్యం నన్ను అనునిత్యం అలరిస్తూ
ఆనందపరుస్తూనే వుంటుంది..
===================================================

Monday, May 23, 2016

అవశేషం
----------------రావెల

పాపం ఆకుర్రాడు
ముక్కు పచ్చలైనాఅరినట్లు కనబడలేదు..
ఏవరి పుణ్యఫలమో కూడా తెలియదు..
మీసాల పొందికగూడా ఇంకా పూర్తిగా
 యేర్పడిన దాఖలా లేదు..

రహదారి మార్గంలో వేగం గా వస్తున్న కారు
ఎలా ఢీకొట్టిందో తెలియడంలేదు..
ఆప్రక్కనే తీయబడిన లోతయిన గుంటనీటిలో పడి
జలసమాధియై పోయినట్లున్నాడు..

ఏ తల్లి శుక్తిముక్తాఫలమో పాపం
ఈ విధంగా అకాల మృత్యువుకు బలై పోయాడు..
ఆగి చూసిన అందరికీ అశ్రువులతో నయనాలు
జలాశయాలవుతున్నాయి..


'మితిమేరిన వేగంతో ప్రయాణం చేయకండి
బాటసారులూమీరుకూడా నా కొడుకుతో పాటు
మృత్యువుతో కౌగిలిలోకి ఒరిగిపోవడానికి
 సిద్ధపడాల్సి వుంటుంది..' జాగ్రత్త సుమా!!

అని కొన్నాళ్ళ తర్వాత తల్లిదండ్రులు అక్కడొక హెచ్చరిక
బోర్డును పెట్టి బాటసారులను హెచ్చరించడం కొత్తగా అనిపించినా
అవసరమేననితోచింది.. ఆ ఫలకం పైని అక్షరలే ఆకుటుంబానికి
స్మృతిపధంలో శాశ్వతమై జీవన గమనంలో మిగిలిపోయాయి..
[ఓ ఆంగ్ల కవితను చదివిన నేపధ్యంలో---]

Sunday, May 22, 2016

ఒక సంతోషంకలిగినప్పుడు
అందరికీ పంచిపెడితే బాగుండునన్న తపన.
ఒక దు:ఖం  పొంగిపొరలినప్పుడు మాత్రం
నా లోనే దానిని నిభాయించుకోగలనన్న భావన..

జననానికీ మరణానికీ మధ్యన
దూరం పెరిగితే బావుండునన్న ఆశ
బ్రతికినన్నాళ్ళూ, ఎవరికీ భారంగా
మసలుకోకూడదన్న శ్వాస...

సంతృప్తికి నిర్వచనం అవసరమా అన్న ప్రశ్న?
సమాగమానికి మనసులుకూడా సహకరించాలని దుగ్ధ..

ఏదిఏమయితేనే మానవుడెప్పటికీ మహనీయుడిగానే
మేదినిపై చరించగలిగితే మేలన్న ఆశయం..
====================================================

Saturday, May 21, 2016

మరణానంతరం......
------------------------రావెల

నా నడకదారిలో ఇవ్వాళ ఒకకళేబరాన్ని చూసాను
రహదారి ప్రమాదలో బాగా గాయపడి మృత్యువు పాలైన
ఒక హరిణమని తెలిసి మనసంతా చివుక్కుమనడం మొదలైంది.


దీనంగా పడివున్న ఆమృగ కళేబరం నాకన్నుల్లో
తడిని ఊటలా ఊరేలాచేసింది.
అప్పటికే కొన్ని చీమలు తమకు ఆరోజుకు  ఆహారందొరికిందన్న
ఆనందంతో అక్కడ స్వైర విహారం చేయడం కనబడి ఆశ్చర్యంవేసింది..
వీటినన్నింటినీ పర్యవేక్షిస్తున్న ధోరణిలో కొన్ని దూడ బోతులూ
మరికొన్ని రాబందులూ రెక్కలను చప్పుడు చేస్తూ తమవంతు వాటాకోసం
అక్కడే వాలిపోయాయి.. ఆ దృశ్యంజుగుప్స కలిగించేదయినా ఆక్షణంలో
నాకు యేవిధమైన జుగుప్స భావం  కలిగిన దాఖలా కనిపించలేదు..

మరణం తర్వాత ఖననానికో దహనానికో తప్ప
ఇతరులకేవిధంగానూ పనికి రాని మానవ దేహం కన్నా
కొన్ని సూక్ష్మ ప్రాణులకైనా ఉపయోగపడి వాటి జీవననానికి
తోడ్పడే ఈ హరిణానికి జోతలిడుతూ సెలవుతీసుకున్నాను..
[ఒక ఆంగ్ల కవిత చదివిన నేపధ్యంలో---]
=====================================

Friday, May 20, 2016

ఇరువైపులా బొమ్మగానే
------------------------రావెల.

యుద్ధం అనివార్యమైనదే అయినా
పూర్తిగా అసంతృప్తి కారకం...
అయితే సమరాంగణానికి వెళ్ళి
చిరంజీవిగా తిరిగొచ్చిన
 వారిని చూస్తే మాత్రం మనసంతా
ఆనంద వార్ధిలా పొంగి ప్రవహిస్తుంది..

శతృభయంకరమైన పోరాటంలో పటిమతో
సజీవులుగా తిరిగొచ్చారన్న తృప్తి
ఆకాశం అంచులను తాకుతూ అలరిస్తుంది..
[ఒక ఆంగ్ల కవితను చదివిన నేపధ్యంలో]
=======================================

Tuesday, May 17, 2016

ఒక సూర్యోదయం కోసం
ఎన్ని రాత్రుల రాతిగుండేలను
చీల్చుకుంటూ సాగిపోవాలో--

ఎన్ని హృదయగత భావాలను
స్వర్న మైదానంలోంచి విసిరేసి
వాస్తవలోకి ఆవిష్కరింపబడాలో--

ఎన్ని సుమనస్కమైన జ్ఞాపకంపు సుమాల
పరీమళాలను వాడుముఖం పెట్టినవన్న నెపంతో
వీడుకోలులు పలుకుతూ వేదనచెందుతూ సాగనంపాలో---

పొడిగింపులతో సశేషంగా సాగుతూ సతమతమౌతున్న

 నిట్టూర్పులనిడుగాడ్పుల నిర్వాకాలను నిండుమనసును
ఓపికగా సహన శీలంతో  భరించగలగాలో--
===================================

నెత్తుటి సంతకం
----------------


అన్ని కాగితాల మీద అదే సంతకం మెరుస్తున్నాననుకుంటున్నది
కానీ స్వయానా గగుర్పాటు కలిగించి ప్రశాంతతను భగ్నం చేస్తున్నది..
అది ఒక అమాయకుడైన యువకుడిదైనాకావచ్చు,
అనుభవశాలిననుకునే ముదుసలిదైనా కావచ్చు--
ఏదెమైనా ఆ సంతకాన్ని వెనువెంటనే చెరిపేయండి..

శాశ్వత ప్రాతికపదిన ఇలాంటి ఉన్మాద ధోరణులకు
చెల్లుచీటిని త్వరితగతిన అందించే ప్రయత్నం చేయండి..
కవులంతా ఏకం కండి---ఈ మరణ మృదంగ విస్ఫుటస్వనాలకు
దూరంగా జనహితమే లక్ష్యంగా రచనలకు శ్రీకారం చుట్టండి..
మొగ్గల్లోనే ఈ మొక్కలను త్రుంచకపోయినందుకుగాను వటవృక్షంలా
విస్తారంగా పెరిగిపోయి ఎంతగా నరమేధానికి పాల్పడుతున్నదో
మీ కన్నులతో మీరే ప్రత్యక్షంగా చూడండి.. శాంతి మంత్రం జపించడానికి
ఇది ఎంత అవరోధంగా పరిణమించిందో వీక్షించండి.
పూదోటలోకి చొరబడి మిడతలదండులా దాడి చేసేస్తున్నది..
పసి మొగ్గలను సైతం పన్నాగాలలో భాగంగా నేలకురాలుస్తున్నది..
నిత్యహరితలా సాక్షాత్కరించవలసిన ధరణీ తలాన్ని
నిత్య క్షుభితగా కూల్చేసి కునారిల్ల జేస్తున్నది..
=================================

Monday, May 16, 2016

వివేకపత్రం
------------------రావెల

చీకటి తగుదునమ్మా అనుకుంటూ
చేసే చిరాకు పుట్టించే చిల్లర
రాజకీయాలకు వెలుగును నిలదీసి
ప్రశ్నించడంలో ప్రయోజనమేముంటుంది?

వెలుగు వేసుకుంటూ వెళుతున్న వెన్నెల
దారులంట చీకటి తప్పనిసరిగా తనవంతుగ
అనుసరించక తప్పదన్న నియమనిబంధనలు
ఏమన్నా రూపొందచబడి వున్నాయంటారా?
 మానవ నైజాన్ని దగ్గరగా పరిశీలించి..
తన అడుగు జాడలను తదనుగుణంగా మార్చుకుని
సమస్త ప్రపంచాన్నీ వేధిమిచి విసిగిస్తున్న రోజుల్లో
మనిషి తన నైజాన్ని ప్రకృతికి విరుద్ధంగా
పరిణమించకుండా మార్చుకోలేకపోవడం
యే సిద్ధాంతాలకు నిదర్శనంగా నిలుస్తుంది?

కాలం నేర్పుతున్న గుణ పాఠాలద్వారా మనిషి
తన ప్రవర్తనను సర్దుబాటుచేసుకోకుండా పోవడం ధర్మమా?
ఇకమనం యేముఖంపెట్టుకుని ప్రకృతిమాతను మానవ
సమాజానికి హితమయే విధంగా తన యంత్రాంగాన్ని
ఆదేశించమని అభ్యర్ధించగలం..?
ఇంట్లో నానాటికీ పెరుగుతూపోతున్న ఈగలమోతను
తగ్గించుకున్నరోజునే బయట పల్లకీ ఊరేగింపుల
దృశ్యాలను వీక్షించగలగడం--మోతలను చెవులారా
వినగలగడం సాధ్యపడుతుందని వేరేగా విన్నవించుకోవాలా?
============================================




Sunday, May 15, 2016

మౌనభంగం
-------------రావెల
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్


మాటల్లేని మౌనంలో
నిండా మునిగిన మనిషి
మాటలు పలకని సంభాషణల్లో
సంవేదనకు గురౌతున్న మనిషి
ఆ మనిషి ఎవరైతేనేం ఒక్క మాట
 మాటాడగలిగితే బావుణ్ణు----
మనసు మనసుతో కలుసుకుని
మనసారా నోరువిప్పి మాటాడుకుంటే
యేటి గ్జలజలలు వినపడాలి
నూత్నంగా లేత చివురులను
సంతరించుకున్న ఆకుల గలగలలు
అతి దగ్గరగా చెవులకు
 వినబడినంత తృప్తి నన్ను
అప్రతిభుడిని తప్పక లేశ
మాత్రమైన ఒక్క ఆశ.. నన్ను ముందుకు నడిపిస్తూ
నయగారాలను నిత్య నూతనంగా సంతరించుకుంటున్నది
ఈ రణ గొణలమధ్యనే జీవుడు సంభాషణలతో నన్ను
ఆసాంతం అలరించాలి--ఆ శుభ ఘడియలకోసమే గదా
ఈ ఆరాటం ఆతృత, ఆవేశం, ఆందోళనలమధ్యన
 ఒక ఆనందం..నాతో చేయించుకున్న
చిరు సత్కారం ఈ చిన్ని కవిత..-----

Saturday, May 14, 2016

అన్నింటా శిశిరతోరణాలే
స్వాగత వచనాలు పలికితే
వసంతం తన ఊసును మరిచిపోయి
గ్రీష్మానికే అతుక్కుని  శాశ్వత
ప్రాతిపదికన అంకితమై పోతే
వాన తన రాకడను ఏదో ఒక సాకుతో
వాయిదాల మీద వాయిదాలేస్తూ పోతుంటే
శరదృతు హేమంతాలు చలినెగళ్ళమన్న
విషయాన్నే విస్మరిస్తూ పోతుంటే

ఇక రుతునర్తనానికి విలువెక్కడ?
 కనీసం వాటికి భువిపై
నిలువనీడుండే  చోటుంటుందా?

నిత్యం ఒకటే దృశ్యాన్ని వీక్షించే
సుమనస్కులకు కొత్తదనం రుచి చూడలేని
దురదృష్టం దాపురించినచో దిక్కేమిటి?
వారిని కంటికి రెప్పలా కాపాడగల ధీశాలులెవ్వరు?
======================================================

Friday, May 13, 2016

పూలతెమ్మెర తనువును తాకి
పులకించిన అనుభూతి
మనసు గవాక్షంలోకి పరిమళాల
పారవశ్యం చొరబడిన అనుభవం
ఎంతగా విశ్లేషించినా ఇంకా
ఏదో చెప్పడం మరిచిపోయామేమోనన్న దుగ్ధ,,
అన్నీ కలగలుపుకుని చిత్రమై కవితలా
ప్రభవించాలన్న మనోరధం---
=============================
ఒక మనిషిని మూల్యాకనం చేయడానికి
పట్టుబడని ఓ ముక్కను పట్టుకు వ్రేలాడడం సబబా!!
కావ్య హేతువేనంటూ కరాళ దంష్ట్రాంకురాలతో
చదువరులను అక్షరసహ గాయపరచడం భావ్యమా?
నిర్మాల్యాన్ని నిర్మూలించాలన్న వంకతోనో తలంపుతోనో
అమూల్యమైన అతడు అతి భద్రంగా హృదయ కుహరాల్లో భద్రపరుచుకున్న అతని
మధురాతి మధురమైన జ్ఞాపకాలమూటను కసువుకుప్పలోకి
దయాహీనంగా విసురుగా విసుక్కుంటూ విసరడం ధర్మమా?
కాలనాళికలో కాలకూటవిషాన్ని  చొప్పించాలని అంతరంగంలో భావిస్తూ    అనవరతం అందుకోసమే  అనవసరపు సమాలోచనం గావిస్తూ  మతం పేరిట కులంపేరిట కల్మషాల కశ్మలాన్ని
అందులోకి  నేర్పుగా మూడోకంటికెరుకలేకుండా ఎక్కించడం విజ్ఞతనిపించుకుంటుందా?
================================================================

Thursday, May 12, 2016

యుద్ధం ముగిసిపోయిందంటే
అంతరంగ మధనం మొదలవాలిగదా!!
చర్చకు ముగింపు పలకాలంటే
మనసుల మధ్యన నిర్మితం కాగదగిన
వంతెన పూర్తిచేయబడాలిగదా!!

శాంతి ప్రబోధం చెవులలోకి ఇంకిపోవాలంటే
అశాంతియేర్పడిన నేపధ్యం పైన
ఒక అవగాహన యేర్పడివుండి వుండాలికదా!!

కవితకు ప్రచారార్హత పొందాలనుకుంటే
అక్షరాలు సమాజహితం వైపు
అడుగులు పడ్తున్న దాఖలాలుండాలికదా!!


సుహృద్భావ వాతావరణం ఏర్పడాలంటే
కక్షలూ,కార్పణ్యాలకూ కాలం చెల్లిపోయి
మనసు మందిరాలలో సురభిళ పరిమళాలు
వెదజల్లబడాలన్న ఊసునెమరేయాలికదా!!
======================================

Wednesday, May 11, 2016

ఒక హృదయాన్ని ఆవిష్కరించడమంటే
ఒక మొక్కను ప్రేమతో నీరు పోసి పెంచడమేగదా!!
ఒక మనసుతో మమేక మవడమంటే
ఒక విశాలమైన వృక్షం చెంతన సేదదీరడమేగదా!!

ఒకరి భావాలతో మరొకరు విభేదించడమంటే
నింగిలో ఉరుములను, మెరుపులను వీక్షిండమేగదా!!

అల్పమైన అక్షరసముదాయంతో అనల్పమైన
భావాలను చిత్రీకరించడమంటే  ఒక నీతిని పొడుపు కధలా
ఉపాఖ్యానాల్లోని సారాంశాన్ని జోడించి బోధించడంకన్నా వేరుకాదుగదా!!

మనిషిని మనిషిని ప్రేమించడమంటే
మమతల గూడులో పక్షి గుడ్లను పొదగడమేగదా!!

ఎందుకు నువ్వెప్పుడూ అనుదినం హైరానా పడుతూ
వగరుస్తూ, కాలాన్ని కనుమరుగు చేయాలని శ్రమిస్తావ్?

కాలమంటే విప్పారిన రెండు బాహువులను విప్పార్చి  ప్రాణులను
తనకనుసన్నలలో కాచి రక్షించే యంత్రమేగదా!!

======================================

మట్టి వాసన పీల్చని మనుషులున్నారంటే
సన్నగా బాధపడ్డాను
ఆకుల గలగలలు వినలేక బోతున్న
ప్రాణులుండబోతున్నాయంటే
సిగ్గు పడక తప్పదనుకుంటున్నాను
============================

Tuesday, May 10, 2016

చేదుపాట
-------------------రావెల

నేను పోగొట్టుకున్న బాల్యం
నాతో ఎకసక్కేలాడుతుంది
ప్రశ్నల పరంపరతో నన్ను
ఉక్కిరి బిక్కిరి చేసి
ఊపిరాడకుండాచేస్తున్నది..

ఒంగుదూకుళ్ళాటలో ఎందుకంతగా
భయపడుతుండే వాడివి?
ఖోఖో ఆటలో ఎప్పుడూ
ప్రతిముఖంగా పరుగెట్టి
 చీవాట్లు తినే వాడివి?
అష్టాచెమ్మా ఆడుదామంటే
అది ఆడపిల్లల ఆటంటూ నిరశించేవాడివి!!
ఎక్కాలప్పజెప్పడంలో
 ప్రధముడిగానిలిచినావుగదానువ్వే!!
శతకాలలోని పద్యాలు వల్లించడంలో
శరవేగంతో దూసుకుపోయే వాడివి?
ఇప్పుడాబాల్యమంతా ఎందుకిలా
బోర్లాపడి కాలికి చెక్కులు
తగిలించుకుంటున్నది..

పోటీ ప్రపంచంలో పూర్తిగా నిమగ్నమై
బాల్యపు రుచులన్నింటినీ , ఆటస్థలాల వూసేలేని
అపార్ట్ మెంట్ గదుల్లో అలసి సొలసి కూలబడుతున్నది?
=========================================

Monday, May 9, 2016

ఆరోహణల పర్వం
----------- రావెల

అడంగుకు చేరాలన్న తపనే
అంతటా విస్తరిస్తుంటుంది..
నీటిజాలయినా సరే
మాట వాలు తోసహా---
అతో మొదలుపెట్టినప్పుడే
అక్షరాభ్యాసపు శిశువు
క్ష దాకా నేర్చేసుకుంటే
బాగుండునని తల్లి తపన..

ఆరోక్లాసులో వున్నప్పుడే
ఐ ఐ టీకి కూడా శిక్షణ నివ్వాలని
కాసుల విద్యాలయాల కంఠ శోష..
మూడో ఫారం లోకి చేరీ చేరగానే
యెంసెట్ లో వాడికి రాంక్ రావాలని
తండ్రి బుర్రలో మెరుపు ఆలోచనలు..
పేదల దగ్గరనే పిండుకుందామని
పార్టీల గుడిసెల భాగోతాలు..
మొదటి కవిత ప్రచురణకాగనే
అవార్డులకోసం ఆరాటం ప్రారంభం..
ఇంటి మెట్లు దాటడం నేర్చుకున్న
పసివాడిపై పర్వతారోహరణం
 చేయించాలన్న తలంపులు--
ఆశకూ అత్యాశకూ అంతరం తెలుసుకుంటే
హృద్రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య
ఢామ్మని క్రిందకు జారి పడి పోతుంది...
సహనం సౌశీల్యంతో జాతి మనుగడ సాగిస్తుంది..
-----------------------------------------------


తెలుగు వెలుగు
---------------------------
మా టాడు నప్పుడు మాధుర్య మొసగును
తేటతెల్లమైన తెలుగు భాష.
యువత రక్తము పొంగి ప్రవహించు నదులుగా
యెలుగెత్తినట్లైన తెలుగు జాతి.
చవులూరగాజేయు చక్కని రచనలు
వెలికి దెచ్చునుండు తెలుగు కైత
శాంత్యహింసల ధర్మ చక్రమ్ము నడపును
చేతనత్వము గల్గి తెలుగు ఠీవి .

శీల సంపద బొల్చును శిష్ట నారి
ధర్మ సూత్రాలు పాటించు తెలుగు జగతి
లలిత కళలను పోషించు లక్ష్య సిద్ధి
తెలుగు వెలుగుల భావ తేజస్సు ఘనము

-----------------------------------------

Sunday, May 8, 2016

అంతు అడ్డులులేని నాజీవయాత్రలోన
కమ్ముకొన్నవి గుండెను  గాఢముగ కౌగలించి
మృదుల మధురానుభూతులు కొంత అధికమ్ముగాను
అవి అన్నియు  అంతట అమ్మనే అలముకొనెను..


Saturday, May 7, 2016

ఆరాటపర్వం
----------------


వెలుగు రేకలు విచ్చుకోవాలని
 తహతహ పడుతూ
పరధ్యానంగా ధునియై
ప్రవహించేవేళ
మబ్బులజలతారులు చీకటిని
గాఢంగా హత్తుకుని
బిగి కౌగిలిలో బంధించిన వేళ
ఊపిరి సలుపని ఆకాశం ఆక్రోశంగా
అలముకున్న చీకటిపై చిందులువేస్తూ
అరుపులూ కేకలను విస్తరింపజేసిన
శుభ ముహూర్తాన --
ఏకాంతం స్రోతస్వినిలా నవ్వుల జలతారులకు
వెండివెలుగులనద్దుతూ, ముత్యాలకోవలా వాన
పడుతూ తడబాటుకు గురిచేసినా, తన్మయత్వం
తారాశశాంకం కావ్యం పఠియించాలని
తగుదునమ్మా !! యని తయారయి కూర్చున్నవేళ
ఆ మనోహరునికోసం పెనవేసుకుపోయిన విరహతాపం
నీటిజల్లుగా జబురుతున్న గాలి వీవనలకు
జడిసిపోక ముసురుకుంటూ ముసి ముసి నవ్వుల
మందహాసాల మృదుహసాలతో ముప్పిరిగొన్న సమయాన..
అలసి సొలసిపోయి అస్తమించవలసిన సూరీడు
ఆగ్రహోదగ్రుడై మరునాటికి తాండవనృత్యకేళితో
గ్రీషమతాపాన్ని ఎల్లెడలా పంచవలెనని
ప్రగాఢంగా తీర్మానించుకున్న సమయాన
వానపాట అల్లరల్లరిగా తడబడి వేదనను
సమ్మిళితంజేసిన విషాదగీతాన్నందుకోవాలని
వెదుకుతున్న వేళ యే కావ్య పఠనంతో నామనసును
సంబాళించుకుని సమభావనతో నెమ్మదింపజేయాలి?
పక్షం రోజులుగా చదువుతూ వస్తున్న విరాట పర్వాన్ని
ఇక చాలులెమ్మనుకుంటూ----- కరుణించిన వరుణ దేవునికి
కృతజ్ఞతగా యేమిచ్చి ఋణం తీర్చుకోగలమన్న యోచనా
మహోదధిలో కొట్టు మిట్టాడుతూ ఈ అల్పజీవి--
==================================

జీవనగీత
------------------రావెల.

బాల్యంలోకి తొంగిచూడాలన్న
భావన రాగానే
బరువైన బాధల గ్రంధాలే
డర్శనమిస్తున్నాయి..

యవ్వనంలోకి వెళ్ళి కొన్ని రేకులకు
వెలుగులద్దుదామనుకోగానే
అప్రాప్త మనోహరుల ఆక్రోసం నన్ను
అతలాకుతలంచేసి చీకటి
తెరలు దించుతున్నది..

నడివయశులోకడుగిడగానే
పిల్లల చదువులు,
 ఆవిడ ఆరోగ్య సమస్యలు
వెన్నంటి వెతలపాల్జేసిన
చేదుజ్ఞాపకాల దొంతర్లు..

ఇక విశ్రాంత జీవన మహోదధిలోనేమో
ఉవ్వెత్తున ఎగసిపడుతూ భయాందోళనలు
ముప్పిరిగొనేలా చేస్తూ ఊపిరాడకుండా
ముఖపుస్తకంలో దోసిళ్ళతో  కుమ్మరించడానికి
వలపు, వగపులను
ఏకోనంఖంగా ఒలికించుకునే వెసులబాటు..

ఇలా జీవిత చిత్రమే ముఖచిత్రంగా వెలువడాలని
కుతూహలంతో కొట్టుమిట్టాడే శబ్దార్ధ సం యోజనాలు...
=======================================





Friday, May 6, 2016

ప్రణయాంజలి
------------------
ప్రేమతో నువ్వు నడిచిన దారులన్నీ
నాలో స్వప్న సౌధాలను నిర్మిస్తున్నాయ్
నేను  విశ్రాంతి తీసుకునే వ్యవధానం కానరాదు.
అంతటా నీ దివ్య మంగళ స్వరూప దర్శనపు
ప్రణయాభిషేకపు స్రోతస్వినుల రసధునులే---
ఇంకా జాగెందుకు వంశీమోహనా నన్ను వశం చేసుకుని
పరవశానందంతో నేను నీమ్రోలమోకరిల్లజెయ్యి స్వామీ!
అనురాగానుబంధాలతో నన్ను అత్మీయంగా అక్కున జేర్చుకో!!
===================================
సహస్రాక్షుడనయితే బాగుండు
అన్ని కళ్ళనూ నీ రూపలావణ్యాలకే
పరిమితంజేసి నిన్ను చూస్తూనే వుండమని
జీవిత గమనాన్ని శాసించవచ్చు..
నాకు సహస్రబాహువులుంటే ఎంత బావుండేదో
ఆత్మీయమైన నా కౌగిలిలో నిన్ను
అమందానంద కందళిత హృదయారవింద
కందళితను చేసానన్న గర్వంతో
ఈ శేష  జీవితాన్ని కొన సాగించవచ్చు---------

================================



Thursday, May 5, 2016

విర జాజి తాపం
-----------------రావెల.

కిటికీ ఊచలు పట్టుకుని
డాబామీదకెగబ్రాకే
 విరజాజి పూలతీవె
ఒడినుండా దోసిళ్ళతో
పూలను దింపి పూర్తిగా నింపేసి
ఎలానవ్వుల నయగారాలు
పోయిందో ఇంకానాకిప్పటికీ
మానసవీధిలో మధుర స్మృతిగా
గుర్తుండిపోయి తలపుకొచ్చినప్పుడల్లా
గుబాళిస్తూ పరవశింపజేస్తుంది..

ఇవ్వాళ ఆ ప్రదేశమంతా బోసిపోయి
నావైపు చూసి ఎకసక్కేలాడుతుంటే
ఎవ్వరినో ఆత్మీయులను పోగొట్టుకున్న
అనుభూతి నన్ను తనువంతా కలచివేసి
కళవళ పెట్టడం నువ్వు
గమనించే వుంటావుగదా----
ఒకప్పుడు అప్రాప్త మనోహరికోసం
అర్రులు చాచిన నా మనసే ఇప్పుడిలా
ప్రాప్తించిన పుణ్యఫలం కనులకు
దూరమై పోయిన విషయం తలుచుకుంటేనే
గుండెనంతటా  కలగుండు పడినట్లనిపి స్తున్నది..
====================================3-5-16
[పల్లె టూర్లో నులకమంచం మీద జాజి చెట్టుక్రింద
అమ్మ నాపురుడుపోసుకుందన్న తలంపును గుర్తుచేసుకుంటూ ]

Tuesday, May 3, 2016

ప్రణయినీ!!
---------------
సహనంతో నాతో సహవాసంచెయ్
అస్తవ్యస్తంగా అల్లుకుపోతున్న
జీవితాన్ని క్రమబద్ధీకరించి
 కమ్మని
రుతువులా మార్చుకుందాం!
 ఈ నీరవ నిస్తబ్ధమైన
కాలగమనంలో ఇలా
అస్తవ్యస్తంగా వీస్తున్న గాలిని
అభిశంసించక తప్పడంలేదు సుమా!!
నీకోసం ఒక మనోహర గీతాన్ని
ఆలపించాలని కుతూహలంగా వుంది..

బంగారాన్ని పోలిన పాత
 సినిమా పాటను పాడనా?
శబ్దఘోషతో హోరెత్తిస్తూ
భావోద్రేకాలకు గురిచేసే
ఆధునిక చిత్రసీమలో గగుర్పాటు కలిగించే
మణిప్రవాళగీతం పాడనా?

============================

Monday, May 2, 2016

నిన్నటిదాకా దిస మొలతో
నిలబడడమే దైనందిన
చర్యగా భావించాను..
గాఢ సుషుప్తిలో కనులు
 మూయడమే ఖాయమని
భావించి కృశించాను----
హేమంతంలో, శరత్తులో
ఎముకలు కొరికే చలిలో
జీర్ణిస్తూ జీవించాను..

అతడొక పిల్ల తెమ్మెరలా
నా తనువునంతటినీ తడుముతూ
పులకరింపజేసాడు..
లేచివురుల నునులేత స్పర్శతో
ననవోన్మేషంగా
తయారయేలా చేసాడు..
ఇప్పుడిలా సుతిమెత్తని చివురుల
చిరుమందహాసాల చిత్తడి నన్ను
చైతన్య శిఖరమనుకునేలా చేసాయి..
అతడికి నేనేమిచ్చి నా రుణం తీర్చుకోగలను?
మళ్ళీ మరోరుతువు ఆగమించేదాకా
మందహాసాల మృదు హాసాలతో
చూపరులను చకచ్చకితం చేస్తూ
నిత్య హరితనై నిభాయించుకుంటాను..
అతడి చూపుల ఉయ్యాలలో
 జగజ్జేగీయమానంగా వెలుగుతూ
అలరిస్తూ జగాన విజేతగా మురుస్తాను..
వసంత యామినినై ఆమనిషిగా
అవతరిస్తూనే అనుసరిస్తాను..
అనునయంగా జీవిత సాఫల్యానికి
ఆనంద నందన వనమై చరిస్తాను
===============================
చెట్లన్నీ మోడువారి
దిసమొలలతో దయ్యాల్లా
సాక్షాత్కరిస్తూ భయపెడుతున్నాయి..
శిశిరమింత దారుణంగా తరూసమూహం  ఒంటిమీద
దుస్తులన్నింటినీ దిగదుడిచివేస్తుందని
ఒక క్షణమైనా ఊహించలేకపోయాను గదా!!
గుండెనిండా పేరుకుపోతున్న నిరాశ..
ఆశలు చివురిస్తాయని ఆ తరువాత సలక్షణంగా
అడుగుబెట్టిన వసంతం కొత్తగా ఆ నగ్నతరువులన్నింటికీ
కొత్త చివురులు తొడుక్కునేలా చేయగా  కళ కళగా కనుపిస్తున్నాయ్..
వనమంతా కొంగ్రొత్త రాగాల కోయిలల్లా గొంతులు సరిచేసుకుని
మనోహరమైన గీతాల నాలపిస్తున్నాయి..
=====================================================