Thursday, June 23, 2016

ఎప్పుడూ ఏదో ఒకలేఖాంశంతో
నిన్ను కదిపి కుదుపుతూ
పలకరించాలని యావగా వుంటుంది..
 మోహనమున తానెక్కిన పారని
గుర్రంలా  మనసులో గూడుకట్టుకున్న భావాలు
నన్ను ఎగర్తించి దౌడుతీసి తప్పించుకుని పరుగెడుతుంటాయి,,

ఐనాసరే ఒక ఆశ మొండిగా నన్ను గట్టిగా గుంజకు
కట్టిపడేసి మళ్ళీ దీపం ముందుకు నెట్టిపడేసి
తలచిన కార్యక్రమానికి భిన్నంగా జరుగకుండా వెన్నంటి
నడిపిస్తూ వుంటుంది.





Wednesday, June 22, 2016

కోరికలు కుబుసాలు విడిచినరాత్రి
అంతా ప్రశాంతంగాకునుకును దీస్తున్నారు.
చెట్టంటూలేని ధరణీతలంలో
రాబోయే రోజుల్లో
పుట్టమట్టికోసమో పాటిమట్టికోసమో
వెదుకుతుండే మనుషులు అసంఖ్యాకంగా
దర్శనమిస్తుంటారు..

ఊపిరాడని సాయంత్రాలు ఊరుముందర తోపులో
ఉరేసుకునే చోటు దొరక్క నైరాశ్యం నీడలో
కాలం గడుపుతూ వుంటాయి..
సూదిమందును గుచ్చినప్పుడల్లా పచ్చని చెట్టును చూడమంటే
ఎదురుగా ఎంతదూరందృష్టిని సారించినా దానిని
కనిపెట్టలేని కబోది స్వరూపాలు గణనీయంగా పెరుగుతుంటారు..

===================================

Tuesday, June 21, 2016

మిణుగురులు
-----------------రావెల.
యోగా దినోత్సవం
ఒంటి కాలిపై కొంగ
జపాన్ని నటిస్తూ--
---------------------
విదేశీ పెట్టుబడులకు
పెద్ద పీట..
స్వదేశీ వ్యాపారులకు
నోటితో  వాగ్దానాల మూట..
----------------------
ప్రతి పర్యటనలోనూ
ఏదొక కొత్తదనం
వస్తూ వస్తూ
దేశ ప్రజలకు
 పంచేందుకు
అసంఖ్యాకంగా
అశ్రువుల సంచులు
--------

Sunday, June 19, 2016

తరువుని మించిన అనుభూతి ప్రధానమైన
కవితను ఇప్పటిదాకా నేను చదువలేదనుకుంటా..

ప్రాణవాయువులనందించే పరమాత్మస్వరూపం తరువు.
ఉదయాస్తమానాల మధ్యన ఉత్సాహాన్ని రేకెత్తించేది కవిత.

అనునిత్యం ఆనంద కారకమై సాక్షాత్కరించే
అదృష్ట శాలిగదా తరువంటే..

గ్రీష్మం లో పక్షిగూళ్ళను
తన జడలో తురుముకునే తల్లివంటిదిగదా తరువు..

హేమంతర్తువులో హిమసౌరభమై ప్రకాశించేది తరువు..

వసంతంలో వాకిట్లోకికొచ్చినిలిచి మంగళ వాద్యమై
వికసించేది తరువు..

వానాకాలంలో తలనిండా స్నానంచేసి సుఖ స్నాతయై
దర్శనమిచ్చే దయాస్వరూపిణితరువు..

శిశిరంలోకూడా చిత్రరూపంలో దర్శనమిచ్చి
శీర్షాసనంవేసికూర్చునేది తరువు..

కవితలను సృజించేదికవులైతే కవులను సృజించ్జేదిమాత్రం
తరువులేనంటే కాదనను..
=================================================
చిలక్కొయ్యకు తగిలించిన బెల్టును
నువ్వు తీసినప్పుడల్లా
నాలో క్రమ శిక్షణ తగ్గిందని ఆనవాలు
డెస్కు మీద రూళ్ళ కర్ర
చేతికొచ్చిందంటే
లెక్కల్లో నేను తప్పటడుగువేసిన చిహ్నాలు..

తప్పులేమనైనా చేసి నిజాయితీగా వొప్పుకుంటే
అప్పటి నీకౌగిలింత నీ అభిమానానికీ,అనురాగానికీ
 అందిపుచ్చుకున్న నాకు అపురూపమైన బహుమతులు..
తరగతిగదిలో బాగా చదువుతున్నానని
ఉపాధ్యాయుడు నీకు చెప్పగనే నీవందించే చిల్లర నాణెం
నా భావి జీవితానికి బాటలువేసిన బంగారు క్షణాలు..

ఇప్పుడేం చెప్పినా యేం చేసినా అన్నీ
నీవందించిన పురస్కారపు మధుర స్మృతులు..
నాన్న అనగానే నా అన్న దిక్కయిపోయావని
ఆచంద్ర తారార్కం అనుకోవడంలోనే నీరునిండిన కనులతో
నేను నీకు చెప్పగలిగిన హృదయపూర్వక కృతజ్ఞతలు..

----------------------------------------------------------------------

Saturday, June 18, 2016

పునరుజ్జీవనం
---------------------రావెల

మానవత్వానికి
ఊపిరాడడంలేదని తెలిసి
అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు..
కొన వూపిరితో కొట్టుమిట్టాడుతున్నది..
కంగారంతా చుట్టూ చేరిన బంధువుల్లో
పొంగిపొరలి ధునిలా ప్రవహిస్తున్నది..

 ప్రాణవాయువునందించే
 స్థంభాన్ని వెంట వెంటనే తరలించారు..

శ్వాస గవాక్షా న్ని[ventilator] అమర్చడంలో సిబ్బంది నిమగ్నమయారు..


ఆకుపచ్చని దిరుసుల్లో వైద్యబృందం విచ్చేసింది..
అమ్మయ్య!!!  ఈ పచ్చదనాన్ని చూసాక తనకు ప్రాణం తిరిగిలేచొచ్చింది..
కానీ ఖర్చులేకుండనే వైద్యంపూర్తయింది...రోగం నయమయింది ..
అందరు బంధువులూ పచ్చదనానికి జయజయ ధ్వానాలు పలికారు..
మానవత్వానికి జీవలక్షణాన్ని ప్రసాదించే తరుణోపాయం
హరిత వర్ణంలోనే కలకాలం జీవిస్తూ వుంటుందని గుణపాఠమయింది...
 దీక్షగా చుట్టాలంతా చెట్లును నాటడం కర్తవ్యంగ స్వీకరించారు..

Thursday, June 16, 2016

హరిత హారం
---------------రావెల
నెర్రెలు విచ్చుకుని
వ్రక్కలై వగచే
 నేలతల్లికోసం
ఒక మొక్కయినా నాటలేమా!!
ఆమొక్కకు మొక్కుబడిగానయినా
ఓ చెంబెడునీరు గుమ్మరించలేమా?

ఇష్టంకాకపోయినా
కష్టసాధ్యమేనని గుర్తెరిగినా
పిల్లలను కనడంలోనూ
పెంచిపోషించడంలోనూ అమితంగా
శ్రద్ధవహించి మురిసిపోయే మనం
మన పూర్వీకులను తలుచుకుంటూ
మురిసిపోతూ ముఖాల్లో
మెరుపులకు తావిచ్చే మనం
నిన్నటిదాకా నిలువనీడనిచ్చిన
చెట్లనుకూడా మళ్ళీ పునరుద్ధరించడం
కర్త్యవ్యంగా భావించి ముందుకడుగువేద్దాం రండి
మనిషికొక్క మొక్కను  నాటగలిగితే  తో 130 కోట్ల మొక్కలకు
దేశంలో  జీవంపోసిన వారమవుతాం..
రుతువుల వైమనస్యాన్ని దూరంగా
తరిమివేసిన  ఘనతను దక్కించుకుంటాం..
ఇంతకన్నా మంచితరుణం ఇలలోఇంకేముంది?
ఆలసించిన ఆశాభంగము,, ఒక సైన్యంలా కదలిరండి..
హరిత హారాన్ని అమూల్యమైన కానుకగా నేలతల్లికి
సమర్పించడానికి సర్వం సహా సన్నద్ధులు కండి--
============================================